నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర, వైఎస్ఆర్ నరరూప రాక్షసుడు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
నీటి కోసం తెలుగు రాష్ట్రాల మధ్య జగడం జరుగుతోంది. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైరయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వంతు వచ్చింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. వైఎస్ఆర్ చేసిన అన్యాయం.. ఇప్పుడు జగన్ చేస్తున్న పనులను విమర్శించారు. పైకి బానే మాట్లాడుతూ.. వెనకాల విమర్శించడం సరికాదని సూచించారు.

వైఎస్ఆర్‌పై హాట్ కామెంట్స్
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన వైఎస్ఆర్ పేరు ప్రస్తావించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామని చెప్పారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామని పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకుని ప్రాజెక్టులు కట్టుకోవాలని సజెస్ట్ చేశారు. కానీ అలా జరగడం లేదని చెప్పారు.

దొంగ ఆనక ఏమంటారు..?
తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్‌ను దొంగ అనక ఏమంటారు? ఇప్పుడు జగన్ కూడా అలాగే నీటిని దోచుకుపోతున్నారు అని శ్రీనివాస్ గౌడ్ ఫైరయ్యారు. నీటి గొడవ, ఇతర అంశాలపై సయోధ్యతో ఉందామనుకుంటే.. నోట్లో చక్కెర.. కడుపులో కత్తెర వైఖరితో ఏపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన ఘనత ఆయనది అని విరుచుకుపడ్డారు.

ఎవరి వల్ల పీజేఆర్ చనిపోయారు..
పీజేఆర్ మృతికి వైఎస్సార్ కారణం కాదా? మా విగ్రహాలు ఏపీలో ఉండవు కానీ.. మీ విగ్రహాలు తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ మొత్తం మీరే ఇచ్చినట్లు విగ్రహాలు పెట్టుకున్నారు. తెలంగాణ అధికారులను ఏపీలో ఇబ్బందులకు గురిచేశారు. నీటిపై సీపీఐ నారాయణ స్పష్టమైన వైఖరి చెప్పాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు.

పైకి దోస్తులే.. కానీ
వాస్తవానికి సీఎం జగన్, కేసీఆర్ పైకి బానే ఉంటున్నారు. కానీ నీటి పంపకాల మధ్య మాత్రం జగడం నెలకొంటుంది. దీంతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడటం ప్రారంభించారు. దానిని శ్రీనివాస్ గౌడ్ కంటిన్యూ చేస్తున్నారు. వేసవిలో కూడా ఏపీ వాటా పూర్తయిన తర్వాత కూడా.. తెలంగాణ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. తాగునీటి అవసరాల కోసం అని ఇచ్చిన.. సాగునీరు, ప్రాజెక్టుల విషయంలో మాత్రం తేడాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications