Tamilnadu Train Accident : తమిళనాడు ఘోర రైలు ప్రమాదం వెనుక ఆ మిస్ మ్యాచ్ !
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో నిన్న ఆగి ఉన్న ఓ గూడ్స్ ట్రైన్ లోకి మైసూరు-దర్భంగా-భాగ్ మతీ ఎక్స్ ప్రెస్ దూసుకెళ్లిన ఘటనపై రైల్వే ముమ్మర దర్యాప్తు చేస్తోంది. అసలు ఈ ఘటన వెనుక ఉన్న కారణాలేంటన్న దానిపై రైల్వే అధికారులు జరుపుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 19 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలవ్వడానికి కారణమైన ఈ రైలు ప్రమాదంపై త్వరలో రైల్వే ఓ ప్రకటన చేయనుంది.
మైసూరు-దర్భంగా ఎక్స్ ప్రెస్ తమిళనాడులోని కవరైపెట్టై స్టేషన్ నుంచి ఏపీలోని గూడూరుకు వెళుతోంది. అదే సమయంలో అక్కడే లూప్ లైన్ పై మరో గూడ్స్ ట్రైన్ కూడా ఆగి ఉంది. కానీ ఎక్స్ ప్రెస్ రైలుకు గూడ్స్ రైలు ఉన్న ట్రాక్ పై వెళ్లేందుకు వీలుగా సిగ్నల్ పడింది. దీంతో 75 కిలోమీటర్ల వేగంతో ఎక్స్ ప్రెస్ రైలు గూడ్స్ రైలులోకి దూసుకుపోయింది. ఈ ఘటన వెనుక సిగ్నల్, రూట్ మిస్ మ్యాచ్ ను కారణంగా రైల్వే అధికారులు భావిస్తున్నారు. అయితే ఇదెలా జరిగిందో మాత్రం తేలలేదు.

సాధారణంగా ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రధాన లైన్ లోనే సిగ్నల్ క్లియరెన్స్ ఇస్తారు. కానీ మైసూరు-దర్భంగా ఎక్స్ ప్రెస్ రైలుకు మాత్రం గూడ్స్ రైలు ఆగి ఉన్న లూప్ లైన్ లోకి సిగ్నల్ ఎలా ఇచ్చారన్న దానిపై ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎక్కడో లోపం జరిగిందని ఘటనపై దర్యాప్తు చేస్తున్న రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఎక్స్ ప్రెస్ రైలు లూప్ లైన్ లోకి ఎంటర్ అయిన సమయంలో భారీగా కుదుపు వచ్చినట్లు ప్రయాణికులు చెప్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి.
అయినా ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications