MK Stalin: కొలత్తూర్ ఎన్నికపై స్టాలిన్ కీలక నిర్ణయం..! మద్రాస్ హైకోర్టులో..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin) కు గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. సిట్టింగ్ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధినేతగా ఉంటూ గతంలో పలుమార్లు గెలిచిన కొలత్తూరు సీటులో ఆయన అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అదీ కొత్తగా పుట్టుకొచ్చిన విజయ్ పార్టీ టీవీకే అభ్యర్ధి చేతిలో ఆయన ఓడిపోయారు. దీంతో తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఇదో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న స్టాలిన్ .. కీలక నిర్ణయం తీసుకున్నారు.
కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు గెలుపుని సవాల్ చేస్తూ స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
కొలత్తూరు సీటులో జరిగిన గత ఎన్నికల్లో ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్ ప్రక్రియలలో లోపాలు ఉన్నాయని ఆయన న పిటిషన్ లో ఆరోపించారు. కాబట్టి ఇక్కడ ఓట్లను తిరిగి లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. అలాగే టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు ఎన్నికను రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని కూడా ఆయన కోర్టును అభ్యర్థించారు.

గతంలో మూడుసార్లు కొలత్తూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎంకే స్టాలిన్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా టీవీకే అభ్యర్ధి వీఎస్ బాబు చేతిలో 9 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1996 తర్వాత తొలిసారి ఇలా ఓటమి పాలైన స్టాలిన్.. అసెంబ్లీకి కూడా దూరమయ్యారు. దీంతో ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ విపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు హఠాత్తుగా స్టాలిన్ కొలత్తూరులో ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు ముగిసిన నెలలు కావస్తుండటంతో మద్రాస్ హైకోర్టు దీనిపై ఎలా స్పందిస్తున్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.














Click it and Unblock the Notifications