డీకే శివకుమార్ కు అమిత్ షా గాలం: నలుగురు ఎమ్మెల్యేలు చాలు, రాత్రి 11కు ఫోన్, నా రక్తంలో!
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డీకే. శివకుమార్ ను వలలో వేసుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాలం వేశారని కర్ణాటక ఎమ్మెల్సీ సీఎం. లింగప్ప (కాంగ్రెస్) గురువారం బాంబుపేల్చారు. తనకు సహకరిస్తే మీరు ఊహించని దానికంటే ఎక్కువ సహాయం చేస్తానని డీకే. శివకుమార్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీఎం. లింగప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

గుజరాత్ ఎమ్మెల్యేలు
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని ఆరోపణలు వచ్చిన సమయంలో ఆ పార్టీ హైకమాండ్ అలర్టు అయ్యింది. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఆలస్యం చెయ్యకుండా వెంటనే బెంగళూరుకు తరలించారు.

డీకే శివకుమార్ ఎంట్రీ
గుజరాత్ కు చెందిన 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పటి కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అండగానిలిచారు. బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ఈగల్టన్ రిసార్టులో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆతిథ్యం ఇచ్చిన డీకే. శివకుమార్ సోదరులు వారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు.

అమిత్ షా ఫోన్
గుజరాత్ ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్న సమయంలో రాత్రి 11 గంటలకు డీకే. శివకుమార్ కు అమిత్ షా ఫోన్ చేశారని, ఆ సమయంలో తాను పక్కనే ఉన్నానని ఎమ్మెల్సీ సీఎం. లింగప్ప అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమకు అప్పగిస్తే మీరు ఊహించని అతి పెద్ద సహాయం చేస్తామని అమిత్ షా డీకే. శివకుమార్ కు హామీ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీఎం. లింగప్ప ఆరోపించారు.

నలుగురు ఎమ్మెల్యేలు చాలు
మీ ఆధీనంలో 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 38 మంది ఎమ్మెల్యేలను మీరే పెట్టుకుని నలుగురు ఎమ్మెల్యేలను మాత్రం మాకు అప్పగించాలని, మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని డీకే. శివకుమార్ మీద అమిత్ షా ఒత్తిడి చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీఎం. లింగప్ప ఆరోపించారు.

నా రక్తంలో కాంగ్రెస్ ఉంది
అమిత్ షా హిందీలో మాట్లాడారని, డీకే. శివకుమార్ ఇంగ్లీష్ లో సమాధానం ఇచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ లింగప్ప అన్నారు. ఆ సందర్బంలో తాను కాంగ్రెస్ మనిషిని, నారక్తంలో కాంగ్రెస్ ఉందని, మీరు అడిగిన సహాయం చెయ్యలేనని డీకే. శివకుమార్ అమిత్ షాకు తేల్చి చెప్పారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ లింగప్ప అన్నారు. ఇంతకాలం సరైన సందర్బం రాలేదుకాబట్టి ఈ విషయం బయటకు చెప్పలేదని, ఇప్పుడు సమయం వచ్చిందని చెబుతున్నానని గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్సీ లింగప్ప మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications