మోడీని పొగడిన ములాయం కోడలు: ఇంటి పోరు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కోడలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. మోడీని మహాత్మా గాంధీతో పోల్చారు. దాంతో ఎస్పీకి, కుటుంబానికి ఇబ్బందిగా మారింది. ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడి భార్య అపర్ణా యాదవ్ మోడీని గురువారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రశంసించారు.
ప్రజాదరణ, చరిష్మా విషయంలో మోడీని మహాత్మా గాంధీతో, సోషలిస్టు సిద్ధాంతవేత్త రామ్ మనోహర్ లోహియాతో ఆమె పోల్చారు. బుధవారంనాడు కూడా మరో కార్యక్రమంలో కూడా మోడీని ఆమె ప్రశంసించారు. మోడీని ఆమె రోల్ మోడల్‌గా అభివర్ణించారు. దేశంలో మార్పునకు మార్గం వేశారని అన్నారు. అపర్ణా యాదవ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడి భార్య.

లౌకికవాద రహిత ఆలోచనలను తొలుత శుభ్రం చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తనను మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నామినేట్ చేసిన తర్వాత వ్యాఖ్యానించారు. అఖిలేష్ యాదవ్ ఆ వ్యాఖ్య చేసిన తర్వాత అపర్ణా యాదవ్ మోడీని ప్రశంసించడం చర్చనీయాంశంగా మారింది.
"సామాన్యుడిపై మోడీ ప్రభావాన్ని చూడండి, రేపటి మంచి కోసం ప్రజలు మోడీపై వైపు చూస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగితే ప్రపంచంలో దేశ ప్రతిష్ట పెరుగుతుంది" అని అపర్ణా యాదవ్ గురువారంనాడు ఓ పాఠశాల కార్యక్రమంలో అన్నారు. మోడీని ప్రశంసించడం వల్ల ఎస్పీకి కోపం రాదా అని అడిగితే మంచిని ప్రశంసించడం వల్ల ప్రమాదమేమీ లేదని ఆమె అన్నారు.
అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష అత్యంత కఠినమైన శిక్ష అని ములాయం సింగ్ గతంలో చేసిన ప్రకటనను కూడా అపర్ణా యాదవ్ వ్యతిరేకించారు. మరణశిక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరగాలనే విషయంలో నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) అభిప్రాయం సరైందేనని, అత్యాచారం కేసుల్లో దోషులుగా తేలినవారిని ఉరి తీయాల్సిందేనని ఆమె ఆ సమయంలో అన్నారు.












Click it and Unblock the Notifications