నాలుగేళ్లలో ఏం చేశారు?: మోడీ సర్కారుపై బీజేపీ దళిత ఎంపీ సంచలనం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో బీజేపీ దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాకిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నగీనా నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానని చెప్పారు.
బీజేపీ ఎంపీ యశ్వంత్ సింగ్ శనివారం మోడీకి రాసిన లేఖలో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు. బీజేపీ దళితులకు చేసిందేమీలేదు: 'గడిచిన నాలుగేళ్లలో మన ప్రభుత్వం దేశంలోని 30 కోట్ల మంది దళితులకు చేసింది ఏమీలేదు. రిజర్వేషన్ వల్ల నేను ఎంపీగా గెలవడం తప్ప ప్రత్యేకంగా సాధించింది ఏమీలేదు. కేవలం దళితుడిని కావడంవల్లే నా సామర్థ్యాన్ని పార్టీ వినియోగించుకోవడంలేదు..' అని ఎంపీ యశ్వంత్ సింగ్ వ్యాఖ్యానించారు.

ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేయరాదంటూ సుప్రీంకోర్టుకు సూచన చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత, గిరిజన ఎంపీలు ఒక్కొక్కరిగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
BJP MP from Uttar Pradesh's Nagina, Yashwant Singh, writes to PM Modi, says, 'Being a Dalit my capabilities have not been put to use, I only became an MP because of reservation,' adds that, 'In 4 years the govt has done nothing for the 30 crore Dalits of the country.' pic.twitter.com/nbao7d6tzd
— ANI UP (@ANINewsUP) April 7, 2018
బహ్రెయిచ్ ఎంపీ సావిత్రి బాయి రెండ్రోజుల క్రితం ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. 'దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం ఒత్తిడి తెస్తున్నా.. బీజేపీ మౌనంగా ఉండటంలో అర్థమేమిటి?' అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాబర్ట్‌గంజ్ బీజేపీ ఎంపీ చోటేలాల్.. మోడీకి రాసిన లేఖలో యూపీ సీఎం యోగి తీరును తీవ్రంగా తప్పుపట్టారు.
తన జిల్లాలో అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఎం సిబ్బంది తనను గల్లాపట్టి నెట్టేశారని ఆరోపించిన చోటేలాల్.. పార్టీలో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్ని వాపోయారు. ఆ మరుసటి రోజే.. ఇటావా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న గిరిజన బీజేపీ ఎంపీ అశోక్ దోహ్రీ.. యూపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, భారత్ బంద్‌లో పాల్గొన్న దళితులపై యోగి సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తున్నదంటూ ప్రధాని మోడీకి లేఖరాశారు. వరుసగా సొంత ఎంపీలే విమర్శలు చేస్తుండటంతో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications