మోదీ విశాఖ పర్యటన: విభజన హామీలు ఎంత వరకు వచ్చాయి, స్థానికంగా వినిపిస్తున్న డిమాండ్‌లు ఏంటి?

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన ఖరారైనప్పటి నుంచి విభజన చట్టంలోని హామీలైన విశాఖ రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, భోగాపురం ఎయిర్ పోర్ట్ పనుల ప్రారంభం వంటి అంశాలపై చర్చ మొదలైంది. ఇంతకూ వీటి ప్రస్తుత స్థితి ఏంటి?
2014లో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లలో అంటే 2024 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అంటే మరో రెండేళ్లలో వీటిని అమలు చేయాలి. అలా చేయాల్సిన వాటిలో ఉత్తరాంధ్రకు సంబంధించి, విశాఖ రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీ ఉన్నాయి.
దక్షిణ కోస్తా రైల్వే జోన్
విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ దశాబ్దానికి పైగా ఆందోళనలు జరిగాయి. ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వే జోన్ వస్తే తమకు ఉపాధి అవకాశాలు రావడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి స్థానిక ప్రజలు అనేక పోరాటాలు చేశారు.
ఏపీ విభజన హామీల్లో భాగంగా ఏపీకి రైల్వే జోన్ ప్రకటించిన కేంద్రం, జోన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించింది.
ఆ తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించి అనేక ప్రకటనలు వచ్చాయి. కానీ అసలు రైల్వే జోన్ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
2019 మార్చిలో దక్షిణ కోస్తా రైల్వే పనుల పరిశీలన కోసం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీని కూడా నియమించారు. ఆ తర్వాత లోక్ సభ, రాజ్యసభలో విశాఖ రైల్వే జోన్ పై ఏపీ ఎంపీలు అనేక మార్లు ప్రశ్నించారు. పరిశీలిస్తున్నాం, రైల్వే బోర్డు అధ్యయనం చేస్తుంది అనే సమాధానాలే తప్ప, ఇప్పటికీ స్పష్టమైన సమాధానం రాలేదు.
మరో వైపు విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రాకపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సెప్టెంబర్ 8, 2022న ప్రకటన చేశారు.
ఇప్పుడు ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా చేస్తున్న రూ. 10,782 కోట్ల విలువ చేసే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పనుల ప్రారంభం కూడా ఉంటుందనే భావన ఉంది.
ప్రధాని పర్యటన షెడ్యూల్ లో రూ. 460 కోట్లతో తలపెట్టిన విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ నిర్మాణాలకు శంకుస్థాపన అని మాత్రమే ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనే ప్రస్తావన లేదు.
ఈ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు నవంబరు 9న మీడియాతో మాట్లాడుతూ, “విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఇప్పటికే ప్రకటించాం. దీనికి సంబంధించిన ఇతర అంశాలపై త్వరలో నిర్ణయం ఉంటుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై ప్రత్యేకంగా ప్రకటన ఉంటుంది. ప్రధాని పర్యటనలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అంశం లేదు. ప్రధాని ఒకటిన్నర రోజు విశాఖలో గడపడం అనేది వైజాగ్ ప్రజలకు ఎంతో గర్వకారణం” అని చెప్పారు.
- చరిత్ర: 'విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- 'అమరజీవి’ పొట్టి శ్రీరాములు మరణానికి కారకులెవరు?

గిరిజన యూనివర్సీటీ
విభజన తర్వాత ఇరు రాష్ట్రాల్లో సమాన విద్యావకాశాలు ఉండాలనే ఉద్దేశంతో విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ సమాన విద్యావకాశాలు అందుబాటులో ఉంచే విధంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు తెలంగాణ, ఏపీలలో ఒక్కొక్కటి చొప్పున గిరిజన యూనివర్సీటీలు కూడా ఏర్పాటు చేయాలి.
గిరిజన యూనివర్సీటీ కోసం విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం రెల్లి గ్రామ శివార్లలో 526 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమి చుట్టూ భారీ ప్రహరీ నిర్మించారు.
కానీ గిరిజన యూనివర్సిటీని మైదాన ప్రాంతంలో కాకుండా గిరిజన ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచనలో పడింది. దాంతో రెల్లిలోని గిరిజన యూనివర్సీటీ పనులలకు బ్రేక్ పడింది. చివరకు కేంద్రం ఆమోదంతో విజయనగరం జిల్లాలోనే సాలూరు మండలం దుగ్గి సాగరం గ్రామ సమీపంలో ఏర్పాటుకు రంగం సిద్దమైంది.
దీనికి 354 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. కానీ అక్కడ వర్సిటీకి సంబంధించిన నిర్మాణ పనులేవీ ప్రారంభం కాలేదు.
విజయనగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ సెంటర్ లో గిరిజన యూనివర్సీటీ తరగతులు 2019లోనే ప్రారంభించారు. ఇప్పటికీ ఇక్కడే క్లాసులు జరుగుతున్నాయి. త్వరలోనే గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన స్థలంలో శాశ్వత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని సాలూరు ఎమ్మేల్యే రాజన్నదొర చెప్పారు.
ప్రధాని మోదీతో గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనుల శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించామని, కానీ, ఈసారి ప్రధాని టూర్‌లో అది సాధ్యపడేలా లేదని చెప్పారు.

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
విశాఖ ఎయిర్ పోర్ట్‌ను తూర్పు నౌకదళం నిర్వహిస్తోంది. అందుకే, దీనిని డిఫెన్స్ ఎయిర్ పోర్టు అని కూడా పిలుస్తారు. టేకాఫ్, ల్యాండింగ్ వంటి విషయాలతో పాటు ఎయిర్ పోర్టు నిర్వహణ అన్నీ విషయాల్లో నేవీ అనుమతులు అవసరం. ముఖ్యంగా ఈ ఎయిర్ పోర్టును విస్తరించే అవకాశం లేదు. ఎందుకంటే ఇది నేవీ ఐఎన్ఎస్ డేగాకు చెందిన స్థలంలో ఉంటుంది.
విశాఖకు అన్నీ హంగులతో ఉండే ఎయిర్ పోర్టు అవసరమని ప్రభుత్వాలు గుర్తించాయి. భోగాపురంలో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కట్టేందుకు 2015లో 2,700 ఎకరాల స్థల సేకరణ చేశారు. దీనికి 2019లో ఫిబ్రవరిలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ, పర్యావరణ అనుమతి పిటిషన్లపై గతంలో స్టే ఉంది. కొద్ది రోజుల క్రితం ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని ఎత్తి వేసింది. దీంతో భోగాపురం ఎయిర్ పోర్టుకు లైన్ క్లియర్ అయ్యింది.
ఈ తరుణంలో మోదీ వస్తుండడంంతో, ప్రధాని చేతులతో భోగాపురం ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించాలనే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వం చేసింది.
“ఎయిర్ పోర్టు పనులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని, మాకు ప్రభుత్వ తరపున అధికారులు సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయడం ప్రారంభించారు. కానీ ఆ తర్వాత ప్రధాని భోగాపురం రావడం లేదన్నారు” అని భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములిచ్చిన రైతు తాతారావు బీబీసీతో చెప్పారు.
భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించే కార్యక్రమం ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ కూడా మీడియాతో చెప్పారు. విమానాశ్రయ నిర్మాణానికి భూసేకరణ వివాదం కోర్టులో కొలిక్కి వచ్చినా, ముందస్తు ఏర్పాట్లు పూర్తి కాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నామని తెలిపారు.
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ

విశాఖ స్టీల్ ప్లాంట్
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ లో కేంద్రానికి చెందిన 100 శాతం వాటాల్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రైవేటు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థని అమ్మడాన్ని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఏడాదిన్నరగా ఆందోళన కార్యక్రమాలు, దీక్షలు చేస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసింది.
ప్రధాని విశాఖ వస్తున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 9 నుంచి ఆందోళనలు చేపట్టారు. అయితే పోలీసులు వీరికి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
స్టీల్ ప్లాంట్ అమ్మకం, వాల్తేర్ డివిజన్ తరలింపు రద్దు చేసి, ఏపీ పునర్విభజన చట్టం హామీలు, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ...ఆందోళన కార్యక్రమాలుంటాయని స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులు ఆదినారాయణ, వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకుడు సీహెచ్ నరసింహరావు ప్రకటించారు.
స్టీల్ ప్లాంట్ పై ప్రధాని ఎటువంటి ప్రకటన చేయారని బీజెపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ప్రధాని పర్యటనలో లేదని అన్నారు.
విశాఖ వైసీపీ నేతలు.. మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫోటోలు పెట్టి 'వెల్ కమ్ టూ వైజాగ్, ఏపీ క్యాపిటల్’ అనే పోస్టర్లను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు.
ఈ పర్యటనలో మూడు రాజధానుల అంశంపై ప్రధాని మాట్లాడబోరని, ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ అంశాలే ఉంటాయని, ఇందులో రాష్ట్రానికి చెందిన అంశాలు ఉండవని జీవీఎల్ నవంబరు 9న మీడియాతో చెప్పారు.
- ఆడవాళ్ల మాంసాన్ని వేయించుకు తినాలనుకున్న అతడిని కోర్టు ఎందుకు విడిచిపెట్టింది?
- 32 ఏళ్ల వయసులో పడుకుంటే, '15 ఏళ్ల వయసులో’ మెలకువ వచ్చింది

విశాఖలో ప్రధాని రోడ్ షో
నవంబర్ 11సాయంత్రం ప్రధాని విశాఖ చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగా సమీపంలోని మారుతి జంక్షన్ నుంచి నేవల్ డాక్ యార్డ్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని బీజేపీ తెలిపింది. ప్రధాని పర్యటనలో ఈ ర్యాలీ లేనప్పటికీ, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని చేర్చారు.
“విశాఖలో ప్రధాని మోడీ టూర్ అధికారిక కార్యక్రమం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున వైసీపీ మొత్తం కార్యక్రమాన్ని నడిపించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో, బీజేపీ నేతలు ప్రధాని టూర్ లో రోడ్ షో ఏర్పాటు చేసి బీజేపీ మార్క్ కనిపించేలా ప్రయత్నిస్తున్నట్లున్నారు” అని ఏయూ పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ మోహనరావు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
- 'ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’ – రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దిగ్భ్రాంతి, ఆగ్రహం
- టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్: పాకిస్తాన్ 1992ను రిపీట్ చేస్తుందా, న్యూజీలాండ్ తొలి వరల్డ్ కప్ కల ఫలిస్తుందా?
- టీ20 వరల్డ్ కప్: భారత్, పాకిస్తాన్ ఫైనల్‌కు వస్తాయా?
- కేఎల్ రాహుల్: ఈ టీమిండియా ఓపెనర్‌పై ఎందుకింత ట్రోలింగ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)