మోడీ ప్లాన్: పవన్ తురుపుముక్క, బాబు కన్వీనర్?
న్యూఢిల్లీ: తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాల్లో బిజెపిని బలోపేతం చేసుకోవడానికి బిజెపి నేత, కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షు నారా చంద్రబాబు నాయుడిలతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీనే కాకుండా ఎన్డియెను బలోపేతం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్‌ను తురుపు ముక్కగా వాడాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
మోడీ వ్యూహంలో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేయకున్నా ఎన్డిఎ భాగస్వామిగా పరిగణిస్తూ బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పవన్ కళ్యాణ్‌ను మంగళవారం జరిగే ఎన్డియె సమావేశానికి ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా పవన్ కళ్యాణ్ మంత్రం తెలంగాణలో కూడా పనిచేస్తుందని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలుగుదేశం, బిజెపి కూటమి సత్తా చాటడానికి పవన్ కళ్యాణ్ ప్రచారం పనికి వచ్చిందని బిజెపి విశ్వసిస్తోంది.

అదే సమయంలో పవన్ కళ్యాణ్‌తో బంధాన్ని కొనసాగించాలని చంద్రబాబు నాయుడు కూడా అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపు, కమ్మ సామాజికవర్గాలు పవన్ కళ్యాణ్ కారణంగానే ఏకమయ్యాయనే విశ్లేషణ సాగుతోంది. ఈ కలయిక తమను మరింత బలోపేతం చేస్తుందని చంద్రబాబు నమ్ముతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు తగిన స్థానం కల్పించే విషయంలో చంద్రబాబు వ్యతిరేకత ప్రదర్శించకపోవచ్చునని అంటున్నారు.
కాగా, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో చేరుతారా, లేదా అనేది స్పష్టం చేయలేదు. తాము ప్రభుత్వంలో చేరకుండానే గతంలో మద్దతు ఇచ్చామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. అయితే, మోడీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడిని ఎన్డియె కన్వీనర్‌గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మంగళవారం జరిగే ఎన్డియె సమావేశంలో చంద్రబాబు కూడా పాల్గొంటున్నారు.












Click it and Unblock the Notifications