మమతా దీదీ అంటూ శుభాకాంక్షలు చెప్పిన మోడీ, అంతకు ముందే బెంగాల్ హింసపై ప్రధాని ఆవేదన
పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఎలాగైనా పశ్చిమబెంగాల్ లో పాగా వేయాలని ప్రయత్నించిన బీజేపీకి షాక్ ఇచ్చి మమతా బెనర్జీ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు.తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈరోజు రాజ్ భవన్ లో గవర్నర్ జగదీప్ ధన్ కర్ సీఎంగా మమతాబెనర్జీతో ప్రమాణ స్వీకారం చేయించారు. మమతాబెనర్జీ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర ట్వీట్ చేశారు.
కంగ్రాచులేషన్స్ మమతా దీదీ.. మోడీ ట్వీట్
కంగ్రాచులేషన్స్ మమతా దీదీ అంటూ వ్యాఖ్యానించిన ప్రధాని మోడీ వెస్ట్ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ ప్రమాణస్వీకారం చేయడాన్ని ప్రస్తావించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా మోడీ ట్వీట్ చేశారు. అంతకుముందు మోడీ బెంగాల్ లో హింస పై ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ లో కొనసాగుతున్న హింసపై ప్రధాని నరేంద్ర మోడీ గవర్నర్ జగదీప్ ధన్ కర్ తో మాట్లాడారు. ఆ సందర్భంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు .అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఇక ఇదే విషయాన్ని గవర్నర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Recommended Video


బెంగాల్ హింసపై మోడీ ఆవేదన .. తనతో మాట్లాడారని ట్వీట్ చేసిన గవర్నర్
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ఆరా తీశారని, ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టాలని గవర్నర్ జగదీప్ ధన్ కర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను మమతా బెనర్జీ ట్విటర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని, అనేక మంది ప్రాణాలు కాపాడుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఉన్నబెంగాలీలు సైతం బెంగాల్ లో చెలరేగిన హింసపై ఆందోళనలో ఉన్నారని తెలిపారు.

బెంగాల్ హింసపై గవర్నర్ సీరియస్ , అందుకే సీఎం మమతకు హితబోధ
దుండగులు హింసను కొనసాగిస్తూనే ఉన్నారని పేర్కొన్న గవర్నర్ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడం సహించరాని నేరమని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బెంగాల్లోనే ఎందుకు హింస చెలరేగిందని, ప్రజాస్వామ్యంపై ఈ దాడి ఎందుకు జరుగుతోంది అని ట్విట్టర్లో ఆయన ప్రశ్నించారు. విచక్షణారహితంగా జరుగుతున్న దాడులపై రాష్ట్ర పోలీసు శాఖ, కోల్ కత్తా పోలీస్ కమిషనర్ వెంటనే సమాధానం చెప్పాలని, పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ రోజు ప్రమాణస్వీకారం తర్వాత సున్నితంగా మమతా బెనర్జీకి రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత శాంతిభద్రతల పరిరక్షణ అని హితబోధ చేశారు గవర్నర్ జగదీప్ ధన్ కర్.












Click it and Unblock the Notifications