సీఎం విజయ్ ప్రోగ్రామ్ లల్లో క్రౌడ్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్: స్పృహతప్పిన మహిళలు, పిల్లలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మధురై పర్యటనలో గందరగోళం నెలకొంది. ఇక్కడి రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో తాయి మామన్ బంగారు ఉంగరం పథకాన్ని ప్రారంభించడానికి వచ్చిన ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భద్రత కారణంగా గంటల తరబడి ఎండలో నిల్చోవాల్సి రావడంతో పలువురు స్పృహతప్పారు. వారిని ఆసుపత్రికి తరలించడానికి వచ్చిన అంబులెన్స్‌లు కూడా సీఎం కాన్వాయ్ వాహనాల వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం జాప్యం ఏర్పడింది.
మధురై వచ్చిన విజయ్ ను చూడటానికి మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ఆసుపత్రి పరిసరాలకు చేరుకున్నారు. ముందు వరుసలో నిలబడితే ఆయనను దగ్గరి నుంచి చూడొచ్చని ఆశించారు. మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండటంతో జనం దాదాపు మూడు గంటల పాటు రోడ్డుపైనే నిల్చోవాల్సి వచ్చింది. తాగేందుకు నీరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు. ఎండ వేడికి తట్టుకోలేక సుమారు 15 మందికి పైగా అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయారు.

ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా మధురైలో అయిదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం నుంచి గాంధీ మ్యూజియం వరకు దాదాపు 44.7 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా భారీ బారికేడ్లను అమర్చారు. దీంతో స్థానికులకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే కాకుండా సాధారణ రహదారులపై కూడా ఈ తరహా ఆంక్షలు విధించడంతో వాహనదారులు, సామాన్య ప్రజలు అనేక పాట్లు పడ్డారు.
స్పృహతప్పి పడిపోయిన మహిళలు, పిల్లలకు అత్యవసర వైద్య సేవలు అందించడానికి పోలీసులు పిలిపించిన అంబులెన్స్ వాహనాలు సకాలంలో చేరుకోలేకపోయాయి. ఆసుపత్రి ప్రవేశ ద్వారంతో పాటు రహదారి మధ్యలో సీఎం కాన్వాయ్ వాహనాలను నిలిపివేయడంతో అంబులెన్స్‌లకు దారి లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితుల్లోనూ వాహనాల నిలిపివేతపై సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే రోగులకు సకాలంలో చికిత్స అందడంలో ఆలస్యమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీవీకే ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా క్రౌడ్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉండట్లేదనే వాదనలు వినిపిస్తోన్నాయి. గతంలో కరూర్ వేలుచామిపురంలో భద్రతా కారణాల వల్ల ప్రజలను ఎక్కువ సేపు నిలువరించడంతో తొక్కిసలాట జరిగి సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసింది. ఆ దుర్ఘటన జరిగి సరిగ్గా ఏడాది పూర్తయిన తరుణంలో మళ్లీ మధురైలో అదే తరహా నిర్లక్ష్యం బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.













Click it and Unblock the Notifications
