పోటెత్తిన ITR ఫైలింగ్స్: తుది గడువుపై కేంద్రం సస్పెన్స్
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి సోమవారం నాటితో గడువు ముగియబోతోంది. గడువు పొడిగింపుపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది కేంద్రం. ఈ నేపథ్యంలో మరో విడత పొడిగింపు ఉండకపోవచ్చు.
ఈ పరిణామాల మధ్య ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్స్ పోటెత్తాయి. ఇప్పటివరకు ఆరుకోట్లకు పైగా ఫైలింగ్స్ దాఖలయ్యాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా అధికం. ఈ సాయంత్రం 6:30 గంటల వరకు ఆరు కోట్ల ఫైలింగ్స్ రికార్డయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా ఒకరోజు గడువు మిగిలివున్న నేపథ్యంలో- ఈ సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ ఒక్కరోజే అంటే ఆదివారం తెల్లవారు జాము నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు దాదాపు 26.76 లక్షల ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయి. అలాగే- ఐటీఆర్ ఫైలింగ్స్ దాఖలు చేయడానికి ఉద్దేశించిన ఆదాయపు పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ లో కోటిన్నర మందికి పైగా లాగిన్ అయ్యారు.
ఐటీఆర్ ఫైలింగ్, పన్ను చెల్లింపు, ఇతర సంబంధిత సేవల కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి అధికారులు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇది 24x7 ప్రాతిపదికన పని చేస్తుంది. దరఖాస్తుదారులతో ఫోన్ కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ ఎక్స్ సెషన్స్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా సహాయ, సహాకారాలను అందిస్తోన్నారు.
జూలై 31 తర్వాత ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగింపు ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరి నిమిషం వరకువేచి ఉండకుండా సకాలంలో ఐటీఆర్ దాఖలు చేయాలంటూ కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా విజ్ఞప్తి చేశారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications