ప్రపంచ కంటే ఎంతో మెరుగ్గా భారత్: వారి పని ఆరోపించడం, విమర్శించడమేనంటూ ప్రధాని మోడీ ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను విమర్శలను ఎప్పుడూ స్వాగతిస్తానని, కానీ, కొందరు నేతలు చేస్తున్న విమర్శలు చాలా దుర్మార్గంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలో వ్యాక్సినేషన్ రికార్డు స్థాయిలో సాగుతోందని అన్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగిందన్నారు.
అయినప్పటికీ ప్రతిపక్ష నేతలు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నాయని ప్రధాని మోడీ మండిపడ్డారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో సాంకేతికత ఎంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. మనదేశంలోనే వ్యాక్సిన్ అభివృద్ధి జరగకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించుకోవాలి. మన దేశం లాంటి అత్యధిక జనాభా గల దేశానికి ప్రపంచం కూడా వ్యాక్సిన్ అందజేయలేదు. కానీ, ఈరోజు మనదేశం ఆత్మనిర్బర్‌తో సొంతంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడంతోపాటు, పంపిణీ చేయడం కూడా జరుగుతోందన్నారు.

దేశంలో 69 శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు వ్యాక్సిన్ తీసుకున్నారు. 25 శాతం మంది ప్రజలు వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్నారు. డిసెంబర్ చివరి నాటికి దేశంలోని పెద్దలందరికీ వ్యాక్సిన్ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ప్రభుత్వం స్పస్టం చేసింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంతో వేగవంతంగా జరుగుతున్నప్పటికీ కొందరు మాత్రం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మోడీ ధ్వజమెత్తారు.
అసలు దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండానే విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలపై ప్రధాని మోడీ మండిపడ్డారు. నేను ఎప్పుడూ మంచి మనసుతో విమర్శలను స్వాగతిస్తాను. అయితే, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు చాలా దిగజారుడుగా ఉన్నాయి. విమర్శలు చేయడం తప్ప వారికీ మరో పనిలేనట్లుగా ఉందని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా వారు స్వాగతించలేకపోతున్నారని ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు మోడీ.
దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్ ఎంతో విజయవంతంగా కొనసాగుతోంది. ఇందుకు అనేక మంది కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తమ కృషిని మీడియా కూడా గుర్తించిందని భావిస్తున్నట్లు తెలిపారు. తాను ఇంతకుముందు జై జవాన్.. జై కిసాన్.. జై విజ్ఞాన్ అనే నినాదాలు ఇచ్చాననని.. ఇప్పుడు వాటితోపాటు జై అనుసంధాన్(పరిశోధన)ను కూడా చేర్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు.
2020, మే నెలలో తాము వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టేందుకు ప్రణాళికలు రచించామని.. అప్పటికి ఇంకా ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కూడా ఆమోదం పొందలేదని ప్రధాని తెలిపారు. గతంలో దశాబ్ధాల పాటు వ్యాక్సిన్ వేశారని, తాము మాత్రం నెలల్లోనే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
స్వదేశంలోనే రెండు వ్యాక్సిన్లను అభివృద్ధి జరిగింది. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ను ఉత్పత్తి చేయగా, పుణెను చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిపీల్డ్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ రెండు వ్యాక్సిన్లకు డ్రగ్ రెగ్యూలేటర్ ఆమోదం లభించడంతో ఈ ఏడాది ప్రారంభం నుంచే వ్యాక్సినేషన్ డ్రైవర్ మనదేశంలో ప్రారంభమైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పేద ప్రజలు కూడా వ్యాక్సిన్ల కోసం వేచి చూడటం కానీ, లంచం ఇవ్వడం గానీ లేకుండానే వ్యాక్సిన్ డ్రైవ్ సాగుతోందని ప్రధాని తెలిపారు. ఓ వలస తన మొదటి డోసు వ్యాక్సిన్ తన సొంత గ్రామంలో తీసుకోగా, మరో డోసు అతను పనిచేసే ప్రాంతంలో తీసుకున్నాడు. ఇందుకు వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమైందని ప్రధాని మోడీ వివరించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ, కరోనా కట్టడిలోనూ ప్రపంచ దేశాల కంటే మనం ఎంతో మెరుగ్గా ఉన్నామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
2014లో దేశంలో ఆరు ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లు ఉండగా.. 22 ఎయిమ్స్ రూపుదిద్దుకుంటున్నాయని ప్రధాని చెప్పారు. 2014 వరకు 380 మెడికల్ కాలేజీలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను 560కి పెంచామని తెలిపారు.
ఆరోగ్య రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృసి చేస్తోందని ప్రధాన ిమోడీ వ్యాఖ్యానించారు. మౌలిక సదుపాయాల మెరుగు కోస అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని ఆస్పత్రుల్లోనూ అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications