త్రిపురలో పూజారి భార్య, కుమారుడి దారుణ హత్య
అగర్తాల: త్రిపుర రాష్ట్ర రాజధానికి 15కిలోమీటర్ల దూరంలోని దుల్కీ గ్రామంలో ఓ తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న 50 ఏళ్ల గౌరి మృతదేహాన్ని, గ్రామ సమీపంలోని చెరువులో ఆమె కుమారుడు దేవవ్రతా చక్రవర్తి(27) మృతదేహాన్ని చూసిన స్థానికులు భయాందోళనలకు తీవ్ర గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరి భర్త దులాల్ చక్రవర్తి స్థానిక లక్ష్మీ నారాయణ ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం దులాల్ తన భార్య గౌరికి పలుమార్లు ఫోన్ చేయగా.. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో దులాల్ అదే ప్రాంతంలో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆమె దులాల్ ఇంటికి వెళ్లింది.

ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. గౌరి రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉంది. అనంతరం గౌరి కుమారుడి కోసం వెతకగా.. సమీపంలోని ఓ చెరువు వద్ద అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారమందుకున్న పోలీసులు జాగిలాలతో ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హంతకులు గౌరిని కొట్టి చంపగా.. ఆమె కుమారుడిని గొంతుకోసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications