నోబెల్ వచ్చిందని ఎంపి మంత్రికి అభినందనల వెల్లువ!
భోపాల్: నార్వేలోని ఓస్లోలో భారత శాంతిదూత కైలాశ్ సత్యార్థి నోబెల్ పురస్కారం అందుకోగా.. మధ్యప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం కైలాశ్ విజయ్‌వార్గియాను అభినందనల్లో ముంచెత్తారు. రాష్ట్ర మంత్రి అయిన కైలాష్ విజయ్ వార్గియా గొప్ప ఘనత సాధించారని, ఆయన తమ సామాజికవర్గంవారేనని కొందరు మంత్రులు గొప్పలు కూడా చెప్పుకున్నారు.
మధ్యప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కైలాశ్ విజయ్‌వార్గియా, నోబెల్ విజేత కైలాశ్ సత్యార్థికి పేరులో పోలిక ఉండటంతో వారు ఏమాత్రం అవగాహన లేకుండా మీడియా ముందు వారికి తోచింది మాట్లాడారు. తమ వర్గం నాయకుడికి నోబెల్ రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.

బచ్‌పన్ బచావో ఆందోళన ఉద్యమకారుడు కైలాశ్ సత్యార్థి నోబెల్ అందుకుంటున్న తరుణంలో మధ్యప్రదేశ్ మంత్రులు కుసుమ్ మెహెదెలే, గిరిజన సంక్షేమ మంత్రి జ్ఞాన్‌సింగ్‌తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు ఇలా వ్యాఖ్యలు చేశారు.
ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు మంత్రి విజయ్‌వార్గియాను ఆరాతీయగా.. నోబెల్ విజేత సత్యార్థి గురించి రాష్ట్రంలో పెద్దగా తెలియదని, రాష్ట్ర రాజకీయాల్లో తాను పాపులర్ కావడంతో తానే నోబెల్ అందుకున్నానని కొందరు నేతలు భావించి ఉంటారని ఆయన నవ్వుతూ బదులిచ్చారు.












Click it and Unblock the Notifications