విజయ్ ఏమనుకున్నా సరే..మా నిర్ణయం ఇదే: తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే కూటమిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా విభేదాలు రచ్చకెక్కాయి. 2029 నాటి లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై టీవీకే, దాని భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ మధ్య ఘర్షణపూరక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు టీవీకే తన మిత్రపక్షాలతో సమావేశం కానుంది.
కూటమి పార్టీలతో టీవీకే భేటీ సమావేశం కాబోతోండటం ఇది రెండోసారి. చెన్నై పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. దీనిపై తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ మాణిక్యం ఠాగూర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ భేటీకి తాము హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఆధవ్ అర్జున, అరుణ్ రాజ్ తమకు ప్రత్యేకంగా ఆహ్వానం ఇచ్చినట్లు వెల్లడించారు. కూటమిని బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడమే తమ ఉమ్మడి లక్ష్యమని చెప్పారు.

తమిళనాడులో ఉన్న ప్రజా సమస్యలపై ఏకాభిప్రాయాన్ని సాధించడమే ఈ రెండో సమావేశం ప్రధాన ఉద్దేశమని మాణిక్కం ఠాగూర్ వివరించారు. మతసామరస్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటి బలమైన పునాదులపై ఈ కూటమి పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా ప్రయోజనాల కోసం తాము కలిసికట్టుగా పోరాడతామని, ఏ సమస్యనైనా పరిష్కరించే దిశగా బలమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన అన్నారు.
విజయ్‌ను దేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా కొందరు టీవీకే ఎమ్మెల్యేలు, నాయకులు ప్రచారం చేయడంపైనా మాణిక్కం ఠాగూర్ స్పందించారు. ఆ చర్చ ఇప్పటికే ముగిసిపోయిందని, దానిని మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని వ్యాఖ్యానించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీనే దేశ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన తేల్చి చెప్పారు. ఎవరేమనుకున్నా ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పారు.
ఎవరి పరిధులు ఏమిటో అందరికీ స్పష్టంగా తెలుసని, రాష్ట్ర స్థాయిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఠాగూర్ ప్రశంసించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి, ఇచ్చిన ఓట్లకు అనుగుణంగా విజయ్ తన కర్తవ్యాన్ని నెరవేర్చుతున్నారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రులు కూడా చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు.













Click it and Unblock the Notifications