కేంద్రానికి లైఫ్ ఇచ్చే బిల్- టీడీపీ ఎంపీకి ఛాన్స్: మాట్లాడేది వీళ్లే
దేశంలో పేపర్ లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో సిద్ధమైంది. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి ముచ్చెమటలు పట్టించేలా కఠిన శిక్షలు విధించడానికి రూపొందించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు 2026 ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి.
ఈ బిల్లు ముసాయిదా ఇదివరకే ఎంపీల చేతికి అందింది కూడా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే వీటి కాపీలను సిద్ధం చేసింది కేంద్రం. అంతకుముందే దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. 2024 నాటి చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ నూతన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. తాజా నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి ఇందులో.

కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సవరణలు చేపట్టడానికి గల కారణలను వివరిస్తారు. అనంతరం దీనిపై చర్చ సాగుతుంది. మధ్యాహ్నం వరకూ అధికార, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు దీనిపై మాట్లాడనున్నారు. తమ అభిప్రాయాలను సభకు తెలియజేయనున్నారు. అవసరమైతే ఈ డ్రాఫ్ట్ బిల్లులో ఏవైనా సవరణలను సూచించే అవకాశం ఉంది.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడే సభ్యుల్లో.. భారతీయ జనత పార్టీ నుంచి బాన్సురి స్వరాజ్, తేజస్వి సూర్య ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి షర్మిల సర్కార్, మిథాలి బాగ్ మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ తరఫున లావు కృష్ణ దేవరాయలు ఈ చర్చలో పాల్గొంటారు. శివసేన (షిండే వర్గం) నుంచి డాక్టర్ శ్రీకాంత్ షిండే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సునీల్ తత్కరే, అప్పాదళ్ తరఫున అనుప్రియా పటేల్, లోక్ జనశక్తి (రామ్ విలాస్ పాశ్వాన్ వర్గం) నుంచి అరుణ్ భారతి మాట్లాడతారు.
ఈ సవరణ బిల్లు ప్రకారం.. పరీక్షల్లో అక్రమాలకు లేదా మాల్ ప్రాక్టీస్ లకు పాల్పడే వ్యక్తులకు విధించే జైలు శిక్షను అయిదు నుంచి పదేళ్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఈ శిక్ష మూడేళ్ల నుంచి అయిదేళ్లుగా మాత్రమే. దీంతో పాటు వ్యక్తిగతంగా విధించే గరిష్ఠ జరిమానా పరిమితిని కూడా రూ. 10 లక్షల నుండి ఏకంగా రూ. 50 లక్షల వరకు పెంచడం ద్వారా పరీక్షల మాఫియాపై ఉక్కుపాదం మోపనున్నారు.
ఈ సంస్థలకు చెందిన డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పులకు పాల్పడితే వారికి కనీస జైలు శిక్షను మూడేళ్ల నుంచి అయిదేళ్లకు పెంచారు. వీరికి విధించే వ్యక్తిగత జరిమానాను కూడా రూ. కోటి నుండి అయిదు కోట్ల రూపాయల వరకు పెంచుతున్నారు. ముఖ్యంగా వ్యవస్థీకృత నేరాలకు (ఆర్గనైజ్డ్ క్రైమ్స్) పాల్పడే ముఠాలకు కనీస శిక్షను ఏడేళ్లకు పెంచడం, జరిమానాను రూ. 10 కోట్లుగా ప్రతిపాదించారు.












Click it and Unblock the Notifications