మహేంద్ర సింగ్ ధోనీ: ఐదోసారి ఐపీఎల్ చాంపియన్‌గా చెన్నై.. చివరి ఓవర్లో రవీంద్ర జడేజా అద్భుతం, ఫైనల్లో గుజరాత్‌పై విజయం

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

ఐపీఎల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ ఐదోసారి చాంపియన్‌గా నిలిచింది.

ఇంతకుముందు 2010, 2011, 2018, 2021 సీజన్లలో సీఎస్‌కే ట్రోఫీని అందుకుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై ఐదు వికెట్ల తేడాతో గెలిచి, మరోసారి ట్రోఫీని ముద్దాడింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో ఇది ఒకటి.

ఐపీఎల్ 2023

టాస్ గెలిచిన ధోనీ, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

215 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగింది. అయితే వాన వల్ల మొదటి ఓవర్లోనే ఆట మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. పిచ్‌ను ఆడేందుకు వీలుగా సిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పట్టింది. సోమవారం అర్ధరాత్రి దాటాక మ్యాచ్ మళ్లీ మొదలైంది.

డక్‌వర్త్‌లూయిస్ రూల్ ప్రకారం చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు.

పవర్‌ప్లేను ఆరు ఓవర్ల నుంచి నాలుగు ఓవర్లకు కుదించారు. బౌలర్‌కు ఓవర్ల పరిమితిని నాలుగు నుంచి మూడుకు తగ్గించారు.

https://twitter.com/IPL/status/1663298116328759296?s=20

చెన్నై అసాధారణ పోరాటం

లక్ష్యం దిశగా చెన్నై జట్టు అసాధారణ రీతిలో పోరాడింది.

వర్షం ముప్పును, ముందున్న లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డెవన్ కాన్వే ధాటిగా ఆడారు.

16 బంతుల్లో 26 పరుగులు(మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కొట్టిన రుతురాజ్, 25 బంతుల్లో 47 పరుగులు (నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) చేసిన డెవన్ కాన్వే ఏడో ఓవర్లో ఔటయ్యారు. ఏడు ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోరు రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులుగా ఉంది.

తర్వాత రహానే, శివమ్ దూబే వచ్చీ రాగానే చెలరేగి ఆడటంతో జట్టు స్కోరు ఎనిమిదో ఓవర్ ముగిసే సరికి 94 పరుగులకు చేరుకుంది.

'ఇంపాక్ట్ ప్లేయర్’ శివమ్ దూబే (21 బంతుల్లో 32 పరుగులు), అజింక్య రహానే(13 బంతుల్లో 27 పరుగుల), అంబటి రాయుడు విలువైన పరుగులు జోడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంబటి రాయుడు కీలక సమయంలో ఎనిమిది బంతుల్లో 19 పరుగులు(ఒక ఫోర్, రెండు సిక్సర్లు) చేశాడు. ఐపీఎల్‌లో రాయుడికి ఇది చివరి మ్యాచ్.

కెప్టెన్ ధోనీ డకౌట్ అయ్యాడు.

రహానే, అంబటి రాయుడు, ధోనీ ముగ్గురూ మోహిత్ శర్మ బౌలింగ్‌లోనే ఔటయ్యారు.

గుజరాత్ బౌలర్లు మోహిత్ శర్మ మూడు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు.

ఆ రెండు బంతుల్లో జడేజా అద్భుతం

టోర్నీలో గుజరాత్ బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచిన మొహమ్మద్ షమీ ఫైనల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.

అయితే కీలకమైన 14వ ఓవర్లో షమి ఎనిమిదే పరుగులు ఇచ్చి, చెన్నై బ్యాటర్లపై ఒత్తిడి బాగా పెంచేశాడు. దీంతో చెన్నె విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ శివమ్ దూబే, మరోవైపు టీ20ల్లో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరైన రవీంద్ర జడేజా ఉన్నారు. మొదటి నాలుగు బంతుల్లో మూడు సింగిల్స్ వచ్చాయి.

ఇక చెన్నై గెలవాలంటే రెండు బంతుల్లో పది పరుగులు కొట్టాలి. నరాలు తెగే ఉత్కంఠ.

మోహిత్ శర్మ యార్కర్‌ వేయడానికి ప్రయత్నించాడు. 'లెంత్’ అనుకున్నట్టుగా పడలేదు. జడేజా లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టాడు.

ఇక విజయానికి నాలుగు పరుగులు కావాలి.

ఈసారి మోహిత్ శర్మ బంతి 'లైన్’ తప్పింది. లోఫుల్ టాస్ బాల్ పడింది. అంతే, జడేజా ఫోర్ కొట్టాడు.

చెన్నై గెలిచేసింది.

చెన్నై అభిమానుల హర్షాతిరేకాలతో స్టేడియం దద్దరిల్లింది.

డగౌట్‌లో చెన్నై జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

చెన్నై జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఓపెనర్ డెవన్ కాన్వే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచారు.

గుజరాత్ ఇన్నింగ్స్

టోర్నీలో నాలుగు సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 39 బంతుల్లో 34 పరుగులు కొట్టాడు.

ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. 47 బంతుల్లో 96 పరుగులు (ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లు) చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 200 పైనే ఉంది.

చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపుల (12 బంతుల్లో 21 పరుగులు)తో గుజరాత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+