టీఎంసీలోకి ముకుల్ రాయ్ రిటర్న్స్- మరింతమంది వస్తారన్న మమతా బెనర్జీ
అంతా ఊహించినట్లుగానే బెంగాల్ రాజకీయాల్లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసలు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికలకు ముందు టీఎంసీని కాదని బీజేపీలో చేరిన నేతలంతా ఒక్కొక్కరుగా తిరిగి తృణమూల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందరి కంటే ముందు బీజేపీలోకి వెళ్లిన సీనియర్ నేత ముకుల్ రాయ్ ఇవాళ తిరిగి టీఎంసీలోకి చేరిపోయారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ముకుల్ రాయ్ గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో తిరిగి టీఎంసీలో చేరతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే ఆయన ఇవాళ తన కుమారుడు సుబ్రాన్షుతో కలిసి టీఎంసీ కార్యాలయానికి వచ్చారు. సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తిరిగి టీఎంసీలో చేరిపోయారు.

టీఎంసీలో తన పాత మిత్రుల్ని తిరిగి కలుసుకోవడం సంతోషంగా ఉందని ముకుల్ రాయ్ వ్యాఖ్యానించారు. తమ నేత మమతా బెనర్జీ బెంగాల్‌కే కాదు దేశానికే నేత అని అభివర్ణించారు. తనకు దీదీతో ఎలాంటి విభేదాలు లేవన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ ముకుల్ రాయ్ తిరిగొచ్చేశారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన మిగతా నేతల్లా ద్రోహి కాదని మమత అన్నారు. అంతే కాదు ముకుల్ బాటలోనే మరికొందరు నేతలు త్వరలో సొంతగూటికి రాబోతున్నారని మమత సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే మమత మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ వారితో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముకుల్ రాయ్ చేరిక ఆరంభమేనని తృణమూల్ నేతలు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications