కొడుకు పేరును మర్చిపోయిన ములాయం: తమ అభ్యర్థి విజయం ఖాయమంటూ యోగి ఆదిత్యనాథ్
న్యూఢిల్లీ: మూడోదశ ఎన్నికలు ఆదివారం జరగనున్న క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ నేతల మధ్య విమర్శల దాడి కొనసాగింది.
సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) నాయకుడు ములాయం సింగ్ యాదవ్ గురువారం తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కోసం ప్రచారం చేయడానికి కర్హాల్ నియోజకవర్గాన్ని సందర్శించారు.

కొడుకు పేరు మర్చిపోయారంటూ ములాయంపై బీజేపీ
ఎన్నికల ర్యాలీలో తొలిసారిగా కనిపించిన ఈ ప్రముఖ రాజకీయ నాయకుడు తన ప్రసంగంలో ఓట్లు అడుగుతున్నప్పుడు తన కొడుకు పేరును 'మర్చిపోవడంపై బీజేపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ పౌరుల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు. పేదరికం, నిరుద్యోగం సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఈ సమస్యలపై తన పార్టీ విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ములాయం తన ప్రసంగంలో అన్నారు.

గుర్తు చేయడంతో అఖిలేష్ భారీ మెజార్టీతో గెలవాలన్న ములాయం
వీడియో ప్రకారం, ములాయం తన ప్రసంగాన్ని ముగించబోతున్నప్పుడు ఓట్లు అడగమని ఎంపీ ధర్మేంద్ర యాదవ్ గుర్తు చేశారు. ఈ సందడిలో 82 ఏళ్ల సీనియర్ రాజకీయ నాయకుడైన ములాయం.. కర్హాల్ ఎస్పీ అభ్యర్థి పేరును మరచిపోయి 'అభ్యర్థిగా ఎవరు వచ్చినా' విజయపథంలో నడిపించాలని ప్రజలను కోరారు. అయితే, అక్కడేవున్న పార్టీ ఎంపీ చెప్పడంతో ఆ తర్వాత.. అఖిలేష్ భారీ మెజార్టీతో గెలవాలని ములాయం అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

ఎస్పీ సింగ్ బఘేల్ విజయం ఖాయమంటూ యోగి ఆదిత్యనాథ్
కొద్ది గంటల తర్వాత, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనపై సరదాగా స్పందిస్తూ.. నేతాజీ(ములాయం) తెలివైన రాజకీయవేత్త అని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ సింగ్ బఘేల్‌ను తమ నాయకుడిగా చేయాలని కర్హాల్ ప్రజలు తమ నిర్ణయం తీసుకున్నారని అతను అర్థం చేసుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'పేరు చెప్పండి' అని అవతలి వ్యక్తి తనకు చెబుతూనే ఉన్నాడని, ఇక్కడ ఎస్పీ అభ్యర్థిత్వంపై ఎవరు పోరాడుతున్నారో నాకు తెలియదని, తండ్రికి తన కొడుకు పేరు తెలియకపోవడం చాలా దురదృష్టకరం అని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ మొత్తం ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునుండగా, ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 20న మూడో దశ పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలవడనున్నాయి.












Click it and Unblock the Notifications