మహారాష్ట్రలో తానెందుకు అవసరమో మళ్లీ నిరూపించిన కాంగ్రెస్..!
మహారాష్ట్రలో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా అధికార మహాయుతి కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో థాక్రే సోదరులతో హోరాహోరీగా పోటీ పడినా అక్కడా అధిక్యం అందుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ముంబైలో విఫలమైనా రాష్ట్రంలోని ఇతర చోట్ల ఉనికి చాటుకుంటోంది. రాష్ట్రంలో కొంతకాలంగా నెలకొన్న రాజకీయాల్లో ఇదో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
మహారాష్ట్రలోని ఇవాళ వెలువడుతున్న మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాల్లో కాంగ్రెస్ పలు చోట్ల ఆధిక్యంలో నిలుస్తోంది. భిన్వాడి నిజాంపూర్, అమరావతి, చంద్రపూర్, లాతూర్‌లలో కాంగ్రెస్ ఇతర పార్టీల కంటే ముందుంది. భివాని నిజాంపూర్‌లో 12, చంద్రపూర్‌లో 12, అమరావతిలో 13 మరియు లాతూర్‌లో 21 వార్డులలో పార్టీ ముందంజలో ఉంది. అంతేకాకుండా కీలకమైన నాగ్‌పూర్,కొల్హాపూర్‌లలో కాంగ్రెస్ రెండవ స్థానంలో ఉంది. నాగ్‌పూర్‌లో 22 వార్డులలో, కొల్హాపూర్‌లో 23 వార్డులలో ఆధిక్యంలో ఉంది. అకోలాలో 15 వార్డులతో రెండవ స్థానంలో ఉంది. పర్భానిలో తొమ్మిది సీట్లలో ఆధిక్యంలో ఉంది.

వాస్తవానికి ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ కాంగ్రెస్ సాధిస్తున్న విజయాలు మాత్రం ఎంతో కీలకమైనవి. ఎందుకంటే అవి క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న మద్దతును నిరూపిస్తున్నాయి. భవిష్యత్తులో మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికలకు ఇవి ఎంతో కీలకంగా భావిస్తున్నారు. కేవలం ముంబైలో మాత్రం కాంగ్రెస్ కు ఘోర పరాజయాలు తప్పలేదు. అయినా థాకరేలు, పవార్లు వంటి ప్రాంతీయ శక్తుల కంటే బలమైన శక్తిగా కాంగ్రెస్ అవతరించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ 171 వార్డులలో ఆధిక్యంలో ఉందని తెలుస్తోంది. పార్టీ పరంగా, ఇది మూడో అత్యధికం.












Click it and Unblock the Notifications