మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా: కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్, డిప్యూటీగా షిండే?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బలనిరూపణ చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన క్రమంలో.. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీకి ఉద్ధవ్ థాక్రే రాజీనామా
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడీకి ప్రత్యర్థుల దిష్టి తగిలిందన్నారు. తమ ప్రభుత్వానికి అదృష్టం కలిసి రాలేదని చెప్పారు. శివసేన అనేక సవాళ్లను ఎదుర్కొందని ఉద్ధవ్ థాక్రే అన్నారు.ముఖ్యమంత్రి పదవితోపాటు ఎమ్మెల్సీ పదవికి కూడా ఉద్దవ్ థాక్రే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను అనుకోకుండా సీఎం అయ్యానని, అలాగే దిగిపోతున్నానని అన్నారు. తాను శిసేన భవన్ లోనే ఉంటానని, అందరినీ కలు్స్తానని అన్నారు.

బీజేపీ, కేంద్రంపై ఉద్ధవ్ థాక్రే విమర్శలు
బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చామని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. శివాజీ మార్గంలో నడిచామని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శదర్ పవార్‌కు ధన్యవాదాలు తెలిపారు ఉద్ధవ్ థాక్రే. తనను సొంతవారే మోసం చేశారని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేశారంటూ బీజేపీ, కేంద్రంపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఏక్‌నాథ్ షిండేకు ఉద్ధవ్ థాక్రే చురకలు
అంతేగాక, శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేకు ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే చురకలంటించారు. ఆటో డ్రైవర్‌ను కూడా మంత్రులను చేశామని ఆయన చెప్పుకొచ్చారు. తాము రెబల్ నేతలకు ఎంత చేయాలో అంత చేశామని, అయినా.. వారు ప్రత్యర్థులతో చేతులు కలిపి తమ ప్రభుత్వాన్ని కూల్చేశారంటూ పరోక్షంగా విమర్శలు చేశారు.

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీగా షిండే
మరోవైపు, ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో బీజేపీ శిబిరంలో నేతలు సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏక్‌నాథ్ సిండే వర్గంలో 50 మంది ఎమ్మెల్యేలను కలుపుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేపట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండేకు ఉపముఖ్యమంత్రితోపాటు రెబల్ నేతల్లో కొందరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications