వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కళ్ల ముందే భార్యా, అమ్మా కొట్టుకు పోయారు. నేనొక్కడినే మిగిలా'.. ఏడాది తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఎలా ఉన్నారు?-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అన్నమయ్య ప్రాజెక్టు

"డ్యాం తెగడంతో మా ఊరికిపైకి వెల్లువొచ్చింది. మా ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఇళ్లు కట్టివ్వలేదు. వానకు, గాలికి గుడిసెలోనే ఉంటున్నాం. నేను గర్భవతిని, నా చిన్న బిడ్డలతో ఈ గుడిసెలోనే ఉంటున్నా. వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. సామాన్లన్నీ తడిసిపోతాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''

దాదాపు ఏడాది క్రితం అప్పటి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగడంతో వరదలకు అన్నీ కోల్పోయిన ఓ బాధితురాలి ఆవేదన ఇది.

కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది.

పది వేల ఎకరాలకు పైగా సాగునీరు, రాజంపేట మున్సిపాలిటీ సహా మరో 18 గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబర్ 19న ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శాపంగా మారింది.

తెల్లవారుజామున అన్నమయ్య ప్రాజెక్టుకు గండి పడడంతో నీళ్లు రాజంపేట మండలంలోని పులపత్తూరు, తొగురుపేట, మందపల్లి, రామచంద్రాపురం గ్రామాలను పూర్తిగా ముంచెత్తాయి.

ఈ వరదల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 మంది మృతిచెందడంతో పాటు కొందరు గల్లంతయ్యారు. చాలామంది గ్రామస్థులు ప్రాణాలకు తెగించి అక్కడ నుంచి బయటపడగా, చెయ్యేరు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలపై కూడా వరద ప్రభావం తీవ్రంగా పడింది.

ఈ వరదలు వచ్చి దాదాపు ఏడాదవుతున్నా గ్రామాల్లో దాని ప్రభావం ఇప్పటికీ అలాగే ఉంది. దాదాపు 2 వేల ఎకరాల భూముల్లో ఇసుక మేటలు వేయడంతో కొన్ని చోట్ల అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.

కొన్ని చోట్ల ఇసుక మేటలు తీశామని ప్రభుత్వం చెబుతున్నా అది కొంతే జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారు. బాధితులందరికీ ఇంకా పూర్తిగా పరిహారం కూడా అందలేదంటున్నారు.

వరదలు

కష్టంతో కట్టుకున్న ఇళ్లు

రాజంపేట ప్రాంతంలో వారు ఉపాధి కోసం ఎక్కువగా గల్ఫ్, కువైట్ వెళ్తుంటారు. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇక్కడ భవనాలు నిర్మించుకున్నారు. అవన్నీ కళ్లముందే పేకమేడల్లా కూలిపోవడంతో వారంతా ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలారు.

వరదలతో ఇళ్లు, భూములు కొట్టుకుపోవడంతో వేలమంది నిర్వాసితులయ్యారు. తినడానికి తిండి, ఉండడానికి నీడ లేక ఆ ప్రాంతంలో ఉన్న కొందరు ఇప్పటికీ దాతల సాయం కోసం ఎదురుచూసే పరిస్థితిలో ఉన్నారు.

వరదలు ముంచెత్తిన గ్రామాల్లో పులపత్తూరులో పూర్తిగా దెబ్బతినగా, మిగిలిన గ్రామాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిలో ఒకటి మందపల్లి. వరదలు వచ్చిన రోజు ఏం జరిగిందో ఆ ఊరు ఉప సర్పంచ్ ఈశ్వరయ్య బీబీసీకి చెప్పారు.

కుటుంబంతో కలిసి గుడిలో దీపం పెట్టాలని వెళ్లిన సమయంలో వరద ముంచెత్తగా తమతోపాటూ మొత్తం 13 మంది కొట్టుకుపోయారని, తన భార్య, తల్లి చనిపోయారని, తానొక్కడినే మిగిలానని చెప్పారు.

"ఉదయం మూడు గంటలకు వరదలొస్తున్నాయని నాకు ఫోన్ వచ్చింది. దీంతో ఊళ్లో వాళ్లను ట్రాక్టర్లతో నవోదయ స్కూల్ దగ్గరికి తరలించాం. తర్వాత ఐదున్నరప్పుడు నా కుటుంబంతో కార్తీక పౌర్ణమి అని గుడిలో దీపం పెట్టాలని వచ్చా. దీపం పెడుతున్నప్పుడే ఆరు గంటలకి గుడి చుట్టూ నీళ్లు ముంచెత్తాయి. మేం అక్కడే ఉన్న కల్యాణ మండపం పైన ఎక్కి నిలబడ్డాం. అంతకంతకూ నీళ్లు ఎక్కువవడంతో అది కూడా కూలిపోయింది. దీంతో అక్కడున్న భక్తులు, పూజారి, నా కుటుంబం మొత్తం కొట్టుకుపోయింది. 2 కిలోమీటర్లు దూరం కొట్టుకెళ్లాక నేను ఒడ్డున పడ్డా, కోమాలోకి వెళ్ళిపోయా. నాకు చాలా దెబ్బలు తగలడంతో ఆపరేషన్లు చేశారు. చనిపోయిన 12 మందిలో నా భార్య, అమ్మ కూడా ఉన్నారు. నేనొక్కడినే ప్రాణాలతో బయటపడ్డాను" అని ఈశ్వరయ్య చెప్పారు.

వరదలు

’ఎలా బతకాలి'

ఈ వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న పులపత్తూరుకు చెందిన లక్ష్మీదేవి కువైట్ వెళ్లి సంపాదించిన డబ్బుతో రెండంతస్తుల ఇల్లు కట్టుకున్నానని, వరదల్లో అన్నీ కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో మిగిలామని చెప్పారు. ప్రభుత్వం అందించిన నగదు సాయం కూడా అయిపోవడంతో ఇప్పుడు కడుపు నిండడం కూడా కష్టంగా ఉందన్నారు.

"ప్రభుత్వం లక్షా పది వేలు ఇచ్చింది. ఇప్పుడు ఆ డబ్బు కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం తినాలి? ఎలా బతకాలి ఎలా ఉండాలి? పొలం పనులకు వెళ్దాం అంటే, వాటిలో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతుల దగ్గర కూడా పనులు లేక ఇళ్లల్లో పస్తులుండలేక నానా కష్టాలు పడుతున్నాం. అప్పోసొప్పో చేసి చిన్న ఇల్లయినా ఉండాలని, కట్టుకుంటున్నాం. దాతలు ఇచ్చిన బియ్యం, పప్పులు అన్నీ అయిపోయాయి. పొలాలు మళ్లీ సాగు చేయాలంటే, సంవత్సరం అవుతుందో, రెండు సంవత్సరాలు అవుతుందో, అప్పటివరకూ మేం ఏం పనులకు పోవాలి" అని తన బాధలను బీబీసీతో పంచుకున్నారు లక్ష్మీదేవి.

అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులను అదుకుంటామని చెప్పిన ప్రభుత్వం నామమాత్రంగానే సాయం చేసిందని, బాధితులకు రెండు నెలల్లో ఇళ్లు కట్టించి ఇస్తామన్న సీఎం జగన్ కనీసం తమను చూడ్డానికి కూడా రాలేదని లక్ష్మి దేవి చెప్పారు.

"రెండు నెలలకు కట్టిస్తామన్నారు. రెండు నెలలయింది, సంవత్సరం కావస్తోంది. ఇంతవరకు అతీలేదు గతిలేదు. బేస్మెంట్లు వేసినారు. వాటికి బిల్లు పడలేదని ఆ పనులు అట్లే ఆపేశారు. ఎండకు గాలికి ఉండలేక గుడిసెలు వేసుకుందామని ఇప్పుడు కట్టుకుంటున్నాం. గాలీవానకు గుడిసెలు ఎగిరిపోతున్నాయి. వానల్లో తడిసి పిల్లలు, గర్భవతులు అల్లాడుతున్నాం. ముఖ్యమంత్రి కనికరించి మాకు ఇళ్లు కట్టించేటట్టు చూడాలి" అని ఆమె కోరారు.

వరదలు

'చేయడానికి పనులు దొరకట్లేదు’

తమకు ప్రస్తుతం నిలువ నీడ లేకుండా పోయిందని, ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం కూడా సరిపోవడం లేదని అదే గ్రామానికి చెందిన వెంకటమ్మ చెప్పారు.

''ఇరవై, ముప్పై ఏళ్లు కష్టపడి సంపాదించిందంతా వరదల్లో కొట్టుకుపోయింది. దాతలు ఇచ్చినవి కూడా కొంత వానల్లో తడిసి కుళ్లిపోయాయి. ఇప్పుడు మేం బియ్యం డబ్బు పెట్టి కొనే స్థితిలో లేం. ఇల్లు లేకపోవడంతో బట్టలు ఉతకాలన్నా, వేరే దారి లేక రోడ్లపై కూర్చొని ఉతుకుంటున్నాం. మా బతుకు రోడ్డున పడింది'' అన్నారామె.

మహిళలే కాదు పులపత్తూరులో చదువుకుని ఏదైనా పని చేసుకుని బతకాలనుకునేవారు కూడా ఏం చేయాలో, ఎలా బతకాలో అర్థంకాని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

వ్యవసాయ పనులు లేవని, మూడు పంటలు పండే భూముల్లో ఇప్పుడు ఇసుక మేటలు వేసిందని పులపత్తూరుకు చెందిన వెంకటరమణ చెప్పారు. జబ్బులు వస్తే కనీసం చూపించుకునే వసతి కూడా లేదని, అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఏం చేయలేదని అన్నారు.

"ప్రస్తుతం కనీసం ఉపాధి హామీ పనులు కూడా లేవు. అవైనా ఉంటే వెళ్లి చేసుకునేవాళ్లం. చదువుకున్నా, నిరుద్యోగులుగా మిగిలిపోయాం. మీ కన్నీళ్లు తుడిచే చెయ్యి నాది అని సీఎం మాతో మాట్లాడినపుడు చెప్పారు. కానీ, ఆ కన్నీళ్లు ఇంత వరకు తుడవలేదు. ప్రభుత్వం ఇచ్చిన లక్షా పది వేలు చిన్న చిన్న అవసరాలకే అయిపోయాయి. కనీసం మాకు ఉపాధి కల్పించండి. మేము కష్టపడైనా బతుకుతాం. చిన్నా, పెద్దా అందరూ దాతలు కట్టించిన రేకుల షేడ్లలో ఉంటున్నాం. అవి కూడా లేకుంటే మా పరిస్థితేంటో ఆలోచించండి. మమ్మల్ని ఆదుకోండి" అని వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.

మందపల్లి లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు తీసినా, తొగురుపేట, రామచంద్రాపురం, కె.రాచపల్లి, పులపత్తూరు ప్రాంతంలో అవి అలాగే ఉన్నాయని మందపల్లికి చెందిన రైతు కాశి రాజు చెప్పారు. ఉటి పరీవాహక ప్రాంతంలో కరకట్టలు వేస్తే పంటలు సాగు చేసుకుంటామని, లేదంటే మళ్లీ వరద వస్తే పంటలు కొట్టుకుపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

"కొన్నిచోట్ల ఇసుకమేటలు ఎత్తేశారు. పులపత్తూరు ఏరియాలో ఇసుక మేట్లన్నీ అలాగే ఉన్నాయి. ఎత్తిన చోట కరెంట్ సప్లయి లాంటివి ఇచ్చారు. ఏటి పరివాహ ప్రాంతంలో గట్టు లేస్తే పొలం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇసుకను కొంతమంది రైతులు తోలుకున్నారు, కొంత ప్రభుత్వం తీసింది. ఏటి పరివాహ ప్రాంతం కావడంతో కరకట్టలు వేస్తే ఫెన్సింగ్ అవీ వేసుకొని ఫైర్లు పెట్టుకుంటాం. కరకట్టలు లేకపోవడం వల్లే మాకు ఇబ్బంది" అన్నారు.

వరదలు

'భూములు వ్యవసాయానికి పనికి రావు’

వరదలు జీవితాలను నాశనం చేయడమే కాదు, కనీసం సమాజంలో బతకనీయకుండా చేశాయని రామాపురానికి చెందిన శివారెడ్డి చెప్పారు. స్కూల్లో అవమానాలు భరించలేక తన బిడ్డ ఆత్మహత్యాయత్నం కూడా చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు.

"మా ఇల్లు పొలాలు అన్నీ పోయాయి. మా పిల్లల్ని కూడా సరిగా పోషించలేకపోతున్నా. కాలేజీలో నా కూతురుకి అవమానం జరిగిందని నిద్ర మాత్రలు మింగింది. బట్టలు కూడా సరిగా వేసుకోకుండా వస్తున్నావేం అని తోటి విద్యార్థులు చాలాసార్లు ఆమెను గేలి చేయడంతో, మనస్తాపానికి గురైన నా బిడ్డ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించుకున్నా. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడే నా భార్య చనిపోయింది. దాంతో వాళ్లను కష్టపడి చదివించుకుంటున్నా" అన్నారు.

ఎన్నో ఏళ్లు కడుపు నింపిన తన భూమి ఏటి పోరంబోకు అని చెప్పి నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని, దీనిపై చాలాసార్లు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించానని శివారెడ్డి చెప్పారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసినా, ఇడుపులపాయకు వెళ్లినా, అమరావతికి వెళ్లినా జగన్‌ను కలవనీయలేదని తెలిపారు.

"సీఎం జగన్‌ను కలిసి నా సమస్య చెప్పాలని, నా గోడు వినిపించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేత అమర్నాథరెడ్డి దగ్గరికి వెళ్తే, నన్ను కొట్టి బయట తరిమారు. ఇల్లు లేక, కొన్నిరోజులైనా ఉందామని అయినవాళ్ళ దగ్గరికి వెళ్తే, ఎవరు మమ్మల్ని రానివ్వలేదు. వరదరాకముందు గొప్పగా బతికాం. ఇప్పుడు ఇలా గుడిసె వేసుకొని ఉంటున్నాం. నారెండు కళ్ళు సరిగా కనిపించవు. పిల్లల కోసమని నెట్టుకుంటూ వచ్చాను. పదో తరగతి చదివిన నా కొడుకు బేల్దారి పనికి పోయాడు. అక్కడ కాళ్ళంతా పుండ్లవడం, చుట్టుపక్కల వాళ్ల దగ్గర అవమానం భారం భరించలేక ఎక్కడో దూరంగా వెళ్లి కూలి పని చేసుకుంటున్నాడు" అన్నారు శివారెడ్డి.

పొలాల్లో మేటలు వేసిన ఇసుకతోపాటూ, బోర్లు రిపేర్లు, పైపులైన్ల రిపేర్ల గురించి ప్రభుత్వం ఇప్పటికీ ఆలోచించలేదని, ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు, ఇప్పుడు చాలాసార్లు కలెక్టర్‌కు అర్జీలు ఇచ్చామని ఈ వరదల్లో నష్టపోయిన తొగురుపేటకు చెందిన కేశవరావు చెప్పారు.

"సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలు మావి. నీళ్లు పుష్కలంగా ఉండేవి. వరి, పసుపు, నువ్వులు, పొద్దుతిరుగుడు లాంటి పంటలన్నీ వేసుకునే వాళ్ళం. సంవత్సరం నుంచి మా భూముల్లో ఇసుక మేటలు ఉండడంతో ఏ పంటలు పండించుకోలేకపోతున్నాం. ఇన్నాళ్లూ దాతల సాయంతో బతికాం. ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా ఖాళీగా కూర్చుంటే తినడానికి కూడా ఇబ్బందని, మేమే సొంతంగా మా పొలాలు బాగు చేసుకుంటున్నాం" అన్నారు.

పులపత్తూరు, మందపల్లి, తోగురుపేట, రామచంద్రపురం లాంటి గ్రామాల్లో దాదాపు 2 వేల ఎకరాల పొలాలు దెబ్బతిన్నాయని కేశవరావు చెప్పారు. సాగుకు పనికిరాకుండా పోయిన భూములకి నష్టపరిహారం అందకపోగా, చనిపోయిన పశువులకి కూడా కొంతమందికే పరిహారం ఇచ్చారన్నారు. దారిన పోయేవారు చెబితే రాసుకున్నారు తప్ప, ఇంటింటికీ వచ్చి ఎవరినీ అడగలేదన్నారాయన.

వరదలు

'సాయం చేస్తున్నాం’

అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.

సీఎం రెండు నెలల్లో మీకు ఇళ్లు కట్టించి తాళాలు చేతిలో పెడతామని బాధితులకు మాట ఇచ్చారని, కానీ, ఏడాది అవుతున్నా వారు గుడిసెల్లో నరకం చూస్తున్నారని అన్నారు. ఆయన బాధితులందరికీ న్యాయం చేయాలని హైకోర్టులో పిల్ కూడా వేశారు.

''అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను ఆదుకోవాలని నేను వ్యక్తిగతంగా కూడా హైకోర్టులో పిల్ వేశాను. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రమాణ పత్రం అంటూ ఏదో ఇచ్చారు. అదంతా కూడా తప్పులతడకగా ఉంది. న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారికి మాత్రమే కొట్టుకుపోయిన పశువులకు, పంటలకు పరిహారం ఇచ్చారు. దీనిపైన సమగ్రన్యాయవిచరణ జరపాలని నేను కోర్టుకు వెళ్ళాను. ముగ్గురు సభ్యులు కాకపోయినా, ఏక సభ్య కమిటీ అయినా వేసి, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను తెలుసుకోవాలని, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మేం కోరుతున్నాం" అని రమేష్ నాయుడు బీబీసీతో చెప్పారు.

ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు ఘటన జరిగిందని రమేశ్ నాయుడు ఆరోపించారు. విశాఖలో గ్యాస్ లీక్ బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇచ్చినట్లే, ఇక్కడివారికి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

"ఘటనకు సంవత్సరం ముందు ఒక గేటు రిపేరు అయ్యింది. ఆ గేటు స్థానంలో మరో గేటు పెట్టి రిపేర్లు చేయలేదు. ఆ గేట్లు సక్రమంగా ఉండి ఆ గేటు ఎత్తుంటే, ఇది కొట్టుకుపోయేది కాదు. గేట్లన్నీ ఎత్తి ఉంటేడ్యామ్‌ను కాపాడుకుని ఉండచ్చు. ఇదంతా ముందుచూపు లేకపోవడం వల్లే జరిగింది. ప్రజల్ని అప్రమత్తం చేయలేదు. ఆర్టీసీకి ముందుగా సమాచారం ఇవ్వకపోవడం వల్లా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది చనిపోయారు" అని ఆయన చెప్పారు.

అయితే అన్నమయ్య జిల్లా కలెక్టర్ పి.ఎస్.గిరీషా మాత్రం ప్రభుత్వం తరఫున వివిధ పరిహారాలకు దాదాపు 22కోట్ల రూపాయలు చెల్లించామని చెబుతున్నారు. బీబీసీతో మాట్లాడిన ఆయన, ఈ వరదల్లో చనిపోయిన 25 మంది, గల్లంతయిన 8 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం అందించామని తెలిపారు. ఇసుక మేటల్లో 90 శాతం తీసేశామని కూడా చెప్పారు.

''గత నవంబర్‌లో భారీ వర్షాల వల్ల చాలా నష్టం జరిగింది. పులపత్తూరు, మండపేట లాంటి ప్రాంతాల్లో వారికి 21 కోట్ల 94 లక్షలు ప్రభుత్వం నుంచి వివిధ పరిహారాల కింద సాయం అందించాం. కుటుంబ సభ్యులను కోల్పోయిన 33 మందికి 5 లక్షలు నష్టపరిహారం అందించాం. 494 కుటుంబాలకు లేఅవుట్లు వేసి 5 సెంట్లు పట్టా ఇచ్చాం. ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇస్తున్నాం. అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇసుక మేటలు వేసిన భూములకు ఎకరాకు 12 వేల చొప్పున ఇచ్చాం. 90 శాతం వరకు ఇసుక మేటలన్నీ తీసేశాం. కొన్ని చోట్ల రైతులే తీసుకుంటున్నారు'' అని చెప్పారు.

ఈ వరదల వల్ల దాదాపు 2వేల ఎకరాల పంట పూర్తిగా దెబ్బతింది. నదీ పనివాహక ప్రాంతం కావడంతో నీరు సమృద్ధిగా ఉంటుంది. దీంతో అక్కడ మూడుకారులు పంటలు పండుతాయి. వరి, పశుపు, అరటి, బొప్పాయి, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు లాంటి పంటలు వేసేవారు.

వరదలు

అన్నమయ్య ప్రాజెక్టు ఎప్పుడు మొదలైంది?

కడప జిల్లాలో ఉన్నప్పుడు రాజంపేటకు 25 కిలోమీటర్ల దూరంలో చెయ్యేరు నదిపై రెండు కొండల మధ్య అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. ఈ జలాశయం సామర్థ్యం 2.24 టీఎంసీలు. 10 వేల ఎకరాలకు పైగా సాగునీరు, రాజంపేట మున్సిపాలిటీ సహా మరో 18 గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో దీనిని నిర్మించారు.

ముందు ఈ ప్రాజెక్టును వరదల్లో తీవ్రంగా నష్టపోయిన పులపత్తూరు, తొగురుపేట గ్రామాల మధ్య రెండు కొండలను కలుపుతూ నిర్మించాలనే ప్రతిపాదనలు వచ్చినా, అక్కడ నిర్మిస్తే ఆ గ్రామాలను ఖాళీ చేయించాల్సి వస్తుందని గ్రామాలకు ఎగువన సుమారు 12 కి.మీల దూరంలో ప్రాజెక్టు నిర్మాణానికి రిపోర్టు సిద్ధం చేశారు.

మొదట దీనికి 'చెయ్యేరు జలాశయం' అని పేరు పెట్టారు. 1976 ఏప్రిల్ 24న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దీనికి శంకుస్థాపన చేశారు. కానీ ఈ ప్రాజెక్టు పనులు మొదలైంది మాత్రం 1981లో టి.అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. 20 ఏళ్ల తర్వాత 2001లో పూర్తైన దీనికి అన్నమయ్య ప్రాజెక్టు అని పేరు పెట్టారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని రైతులకు అంకితం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి అయిన వ్యయం కేవలం రూ.60.44 కోట్లే అని వివిధ వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.

కానీ కొన్ని దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించాల్సిన ఈ ప్రాజెక్టు ప్రారంభమైన 20 ఏళ్లకే కొట్టుకుపోయింది. ఈ వరదల్లో మొత్తం 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాజెక్టు పున:నిర్మాణంపై ప్రభుత్వ యంత్రాంగం దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'My wife and mother died before my eyes. I am the only one left'.. How are the victims of the Annamayya project after a year?-BBC Ground Report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X