హైదరాబాద్ పోలీసులను ఫాలో అవ్వండి: మైసూరు గ్యాంగ్‌రేప్‌పై హెచ్‌డీ కుమారస్వామి
బెంగళూరు: ఇటీవల మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన కర్ణాటక రాష్ట్రంలో దుమారం రేపుతోంది. ప్రభుత్వం, పోలీసులపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తాజాగా, జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఘటనపై తీవ్రంగా స్పందించారు.
విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అంతేగాక, 2019లో హైదరాబాద్‌లో జరిగిన దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన విధంగా.. మైసూరు గ్యాంగ్‌రేప్ నిందితులను కూడా హతమార్చాలని అన్నారు. దిశ అత్యాచారం, హత్య కేసులో హైదరాబాద్ పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని ఆయన సమర్థించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. దిశ కేసులో నిందితుల పట్ల హైదరాబాద్ పోలీసులు వ్యవహరించినట్లే మైసూరులో విద్యార్థినిపై రేప్ కేసు ఘటనలో కూడా దోషులను శిక్షించాలని కుమారస్వామి అన్నారు. హైదరాబాద్ పోలీసుల చర్యలను అనుసరించాలని సూచించారు. ఇలాంటి నేరాల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితులు మెరుగుపడతాయన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా చర్యలు తీసుకోలేకపోతున్నారంటూ కర్ణాటక బీజేపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై కుమారస్వామి మండిపడ్డారు. నేరాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గ్రామాల్లో జూద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రస్తుత వ్యవస్థ నేరాలను ప్రోత్సహించే విధంగా ఉందన్నారు. నేరాలకు పాల్పడుతున్నవారు అలా జైలుకు వెళ్లి.. ఇలా బెయిల్ పై బయటకు వస్తున్నారని.. అందుకే నేరస్తులకు భయం లేకుండా పోతోందన్నారు. అందుకే, మైసూరులో జరిగిన విద్యార్థిని అత్యాచారం కేసులో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని, ఈ విషయంలో హైదరాబాద్ పోలీసులను అనుసరించాలని పునరుద్ఘాటించారు.
నిందితులను పట్టుకోకపోవడంపై ప్రతిపక్షాలు ప్రభుత్వం, పోలీసులపై మండిపడుతున్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు అయినప్పటికీ నిందితులను పట్టుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు బెళగావి రూరల్ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాల్కర్. ఈ ఘటనలో దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ.. ఈ కేసులో పోలీసులు తమ శక్తికి మించి పనిచేస్తున్నారని అన్నారు. త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుని శిక్షిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ మాట్లాడుతూ.. ఈ అత్యాచారం కేసులో నిందితులను నరికివేయాలని, ఇలా చేస్తేనే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు.
గురువారం సీఎం బసవరాజ్ బొమ్మై ఈ ఘటనపై మాట్లాడుతూ.. నిందితులను త్వరలో పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Recommended Video
కాగా, ఎంబీఏ చదువుతున్న బాధిత విద్యార్థిని (23) తన స్నేహితునితో కలిసి మైసూరు శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్ళి, తిరిగి వస్తూండగా మంగళవారం రాత్రి దాదాపు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడి చేశారు. ఆ విద్యార్థినిపై వారు సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమె స్నేహితుడిని తీవ్రంగా కొట్టారు. పోలీసులు ఆమె స్నేహితుడి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు ప్రాంతంలోని లలితాద్రిపుర, తిప్పయ్యనకెరే సమీపంలో గత మంగళవారం రాత్రి 8 గంటలకు ఈ దారుణం జరిగింది. బాధితురాలు వేరొక రాష్ట్రం నుంచి వచ్చి మైసూరులో చదువుతున్నట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications