కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా మృతి: 10కి చేరిన మరణాలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో జాతీయ పార్క్‌లో మరో చీతా చనిపోయింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మంగళవారం ప్రాణాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం చీతా తూలుతూ నడవడాన్ని గమనించిన ట్రాకింగ్ టీం.. బలహీనంగా ఉన్న ఆ చీతాకు వెంటనే చికిత్స అందించారు. అనంతరం అది కాస్త కోలుకున్నట్లు కనిపించింది.
అయితే, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చీతా చనిపోయిందని అధికారులు పేర్కొన్నారు. పోస్టుమార్టం తర్వాత చీతా మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ విషయంపై మధ్యప్రదేశ్ పర్యావరణ శాఖ మంత్రి నగర్ సింగ్ చౌహాన్ స్పందించారు. నమీబియా నుంచి తెచ్చిన మరో చీతా శౌర్య మృతి చెందిన సమాచారం అందిందని తెలిపారు.

పశువైద్యులు తీవ్రంగా శ్రమించి ఆ చీతాను కోలుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఫలితం లేకపోయిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం చీతా శౌర్య మృతి చెందిందని చెప్పారు. కాగా, దేశంలో ఇప్పటివరకు మృతిచెందిన చీతాల సంఖ్య 10కి చేరింది. దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టు చీతాను చేపట్టింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు. అయితే, ఇందులో ఆరు చీతాలు పలు కారణాలతో చనిపోయాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టగా, అనారోగ్య కారణాలతో అందులో మూడు చనిపోయాయి. తాజా మరణంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన చీతాల సంఖ్య 10కి చేరినట్లు అధికారులు తెలిపారు. భౌగోళిక వాతావరణ మార్పులు చీతాల మరణానికి కారణంగా అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications