మోడీ 15వ ప్రధాని, అంతకుముందు వీరే... (పిక్చర్స్)
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ భారత దేశానికి 15వ ప్రధానమంత్రి కానున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన రెండో ప్రధానమంత్రి.
గతంలో అటల్ బిహారీ వాజపేయి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెలిచినప్పడు ప్రధానిగా పని చేశారు. ఆ తర్వాత ఇప్పుడు బిజెపి నేత ప్రధాని అవుతున్నారు.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. ఆయన 1947 నుండి 1964 వరకు ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి (1964-66), ఇందిరా గాంధీ (1966-77, 1977-80), మొరార్జీ దేశాయ (1977-79), చరణ్ సింగ్ (1979-80), రాజీవ్ గాంధీ (1984-89), విపి సింగ్ (1989-90), చంద్రశేఖర్ (1990-91), పివి నర్సింహా రావు (1991-96), అటల్ బిహారీ వాజపేయి (1996), హెచ్‌డి దేవేగౌడ (1996-97), ఐకె గుజ్రాల్ (1997-98), వాజపేయి (1998-99, 1999-2004), మన్మోహన్ సింగ్ (2004-14). నెహ్రూ, శాస్త్రీల మరణానంతరం గుల్జారీలాల్ నందా కొన్నాళ్లు ప్రధానిగా పని చేశారు.

జవహర్ లాల్ నెహ్రూ
జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారత దేశ తొలి ప్రధాని ఆయన ఆగస్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు.. అంటే ఆయన మృతి చెందే వరకు ప్రధానిగా ఉన్నారు.

మొరార్జీ దేశాయ్, కాంగ్రెస్
గుజరాత్ రాష్ట్రంలోని సబరకాంత నుండి ఎంపీగా గెలిచిన కాంగ్రెసు నేత గుల్జారీలాల్ నందా.. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రీలు మృతి చెందిన అనంతరం రెండుసార్లు ఇంటరిమ్ ప్రధానిగా ఉన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి, కాంగ్రెస్
అలహాబాద్ నుండి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి.. నెహ్రూ మృతి అనంతరం భారత ప్రధానిగా పని చేశారు. శాస్త్రీ జూన్ 9, 1964 నుండి జనవరి 11, 1966 వరకు ప్రధానిగా పని చేశారు. ఆయన పాకిస్తాన్‌తో యుద్ధ అనంతరం తాష్కెంట్ ఒప్పందం కోసం వెళ్లినప్పుడు మృతి చెందారు.

ఇందిరా గాంధీ, కాంగ్రెస్
నెహ్రూ కూతురు అయిన ఇందిరా గాంధీ మార్చి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు ప్రధానిగా పని చేశారు. ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. ఆ తర్వాత జనవరి 14, 1980 నుండి అక్టోబర్ 31, 1984 (మృతి చెందే వరకు) ప్రధానిగా ఉన్నారు.

మొరార్జీ దేశాయ్, జనతా దళ్
మొరార్జీ దేశాయ్ మార్చి 24, 1977 నుండి జూలై 28, 1979 వరకు ప్రధానిగా ఉన్నారు. తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వానికి ఈయన నాయకత్వం వహించారు.

చరణ్ సింగ్, జనతా పార్టీ (సెక్యులర్)
చరణ్ సింగ్ 170 రోజుల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. జూలై 28, 1979 నుండి జనవరి 14 1980 వరకు కాంగ్రెస్ మద్దతుతో ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెసు పార్టీ మద్దతు ఉపసంహరించింది.

రాజీవ్ గాంధీ, కాంగ్రెస్
రాజీవ్ గాంధీ అక్టోబర్ 31, 1984 ప్రధాని పదవిని అలంకరించారు. మే 21, 1991లో హత్యగావింపబడ్డారు. రాజీవ్ హయాంలో కాంగ్రెస్ పార్టీ 415 స్థానాలను గెలుచుకొని రికార్డ్ సృష్టించింది.

విపి సింగ్, నతా దళ్
ఫతేపూర్ నుండి ఎంపీగా ఎన్నికైన విపి సింగ్ డిసెంబర్ 2, 1989 నుండి నవంబర్ 10, 1990 వరకు భారత దేశ ప్రధానమంత్రిగా పని చేశారు.

చంద్రశేఖర్, సమాజ్‌వాది జనతా దళ్
బలియా నుండి ఎంపీగా గెలుపొందిన చంద్రశేఖర్ నవంబర్ 10, 1990 నుండి జూన్ 21, 1991 వరకు భారత దేశ ప్రధానమంత్రిగా పని చేశారు.

పివి నర్సింహా రావు, కాంగ్రెస్
పివి నర్సింహా రావు జూన్ 21, 1991 నుండి మే 16, 1996 వరకు భారత దేశ ప్రధానమంత్రిగా ఉన్నారు. మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన నెట్టుకు వచ్చారు.

వాజపేయి, బిజెపి
అటల్ బిహారా వాజపేయి తొలిసారి 13 రోజులు, ఆ తర్వాత 13 నెలలు ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత ఐదేళ్లు ప్రధానిగా ఉన్నారు. 1996లో మే 16 నుండి జూన్ 1 వరకు తొలిసారి 13 రోజులు, 1998-1999లో 13 నెలల పాటు ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 13, 1999 నుండి మే 19, 2004 వరకు ప్రధానిగా ఉన్నారు.

దేవేగౌడ, జనతా దళ్
కర్నాటక రాష్ట్రానికి చెందిన జనతా దళ్ అధినేత హెచ్‌డి దేవేగౌడ జూన్ 1, 1996 నుండి ఏప్రిల్ 21, 1997 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు.

ఐకె గుజ్రాల్, యునైటెడ్ ఫ్రంట్
ఇందర్ కుమార్ గుజ్రాల్ (ఐకె గుజ్రాల్) ఏప్రిల్ 21, 1997 నుండి మార్చి 19, 1998 వరకు భారత దేశపు ప్రధానమంత్రిగా పని చేశారు.

మన్మోహన్ సింగ్, కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ రెండుసార్లు ప్రధానమంత్రిగా అయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏలో ఆయన ప్రధానిగా ఉన్నారు. మే 22, 2004 నుండి మే 17, 2014 వరకు ఆయన ప్రధానిగా ఉన్నారు.

నరేంద్ర మోడీ, బిజెపి
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపారు. అదే గుజరాత్ మోడల్ అభివృద్ధి మంత్రంతో త్వరలో భారత దేశ ప్రధాని కాబోతున్నారు.












Click it and Unblock the Notifications