గొప్ప నాయకుడు, మంచి మనిషి: మోడీపై సుప్రీం చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ప్రశంసలవర్షం కురిపించారు. నరేంద్ర మోడీ ముందుచూపున్న గొప్ప నాయకుడని, మంచి మనిషని అన్నారు. దేశానికి సుపరిపాలన ఇవ్వాలన్న గట్టి కోరిక గల వ్యక్తని ఆయన అన్నారు.
‘నేను ఆయన(మోడీ)ని మంచి నాయకుడిగా, మంచి మనిషిగా, దూరదృష్టి ఉన్న వ్యక్తిగా, సుపరిపాలన వాంఛించే వ్యక్తిగా పరిగణిస్తా' అని హెచ్ఎల్ దత్తు వ్యాఖ్యానించారు. ప్రధాని పనితీరుపై మీ అంచనా ఏంటని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన పై విధంగా స్పందించారు.

న్యాయవ్యవస్థ అవసరాలను ప్రభుత్వం బాగా తీరుస్తోందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలోని మూడు అంగాలూ నిర్దేశిత ప్రమాణాల మేరకు పని చేయడం ప్రశంసించదగ్గ పరిణామమన్నారు. ప్రధానితో తన సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటికి మోడీని నాలుగు సార్లు కలిసినట్లు చెప్పారు.
‘అయితే మేం ఆయన నుంచి ఏమీ ఆశించడం లేదు. ఆయన కూడా మా నుంచి ఏదీ కోరడం లేదు. న్యాయవ్యవస్థ పనితీరుపై మేం సంతృప్తిగా ఉన్నాం' అని న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు పేర్కొన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలిజీయం వ్యవస్థను రద్దు చేయడంపై తాను అసంతృప్తికి లోనుకావడం లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications