కాంగ్రెస్ కోపానికి గురయ్యారు: లతా మంగేష్కర్‌పై మోడీ
పాట్నా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ శుక్రవారం బీహార్ రాష్ట్రంలోని మోతిహరిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు లక్ష మంది వరకు కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపైనా విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంలోనే భారతరత్న, బాలీవుడ్ గాయకురాలు లతా మంగేష్కర్ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏ ప్రభుత్వం ఆమెకు భారతరత్న ప్రకటించిందని పేర్కొన్నారు. అంతేగాక గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రశంసించి కాంగ్రెస్ కోపానికి గురైన చాలా మంది వ్యక్తులు, ఇప్పుడు ఆయనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. వారిలో లతా మంగేష్కర్ కూడా ఒకరని తెలిపారు.

తన(మోడీ)ను లతా మంగేష్కర్ కలవడంపై వివరణ ఇవ్వాలని కేరళకు చెందిన ఓ మంత్రి అడిగారని, అంతేగాక ఆమె గుజరాత్ ముఖ్యమంత్రిని ప్రశంసించిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారని చెప్పారు. రాజకీయాల్లోకి అంటరానితనాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా అని మోడీ ప్రశ్నించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులే అంటరానితనాన్ని రాజకీయాల్లోకి తెచ్చారని ఆరోపించారు.
‘మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. మీరు ‘ఉంఛ్', 'నీచ్' లాంటి పదాలు వాడటం గౌరవప్రదంగా ఉండదు' అని సోనియా గాంధీ పేరు ప్రస్తావించకుండా అన్నారు. లతా మంగేష్కర్ విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఇంతకుముందు కూడా మోడీ పలుమార్లు ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య బద్ధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగడం లేదని, ఆ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే సిబిఐ విచారణల పేరుతో వేధింపులకు పాల్పడి, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications