నాసా జోక్యం: మరో 48 గంటల్లో ఇస్రో చేతికి విక్రమ్ ల్యాండర్ ఫొటోలు!
Recommended Video
బెంగళూరు: చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించిన విక్రమ్ ల్యాండర్ పరిస్థితి ఎలా ఉంది? తలకిందులుగా పడిందా? నిద్రాణస్థితిలోకి ఎలా జారింది? దీనికి గల కారణాలేంటీ? నిరంతరాయంగా వేర్వేరు రూపాల్లో పంపిస్తోన్న రేడియో సంకేతాలను ఎందుకు పసిగట్టలేకపోతోంది? ప్రస్తుత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను కంటి మీద కునకు లేకుండా చేస్తోన్న ప్రశ్నలు ఇవి. ఇందులో ఏ ఒక్క ప్రశ్నకూ ఇస్రో శాస్త్రవేత్తల వద్ద సరైన సమాధానం లేదు. చివరికి అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధక కేంద్రం (నాసా) పంపిస్తోన్న సంకేతాలను కూడా విక్రమ్ ల్యాండర్ గ్రహించట్లేదంటే.. దాని పరిస్థితి ఆందోళనకరంగానే ఉండొచ్చనే అనుమానాలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలుస్తున్నాయి.

విక్రమ్ ల్యాండర్ ఫొటోలు తీయనున్న నాసా లూనార్ ఆర్బిటర్..
వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికే క్షణం రానుంది. మరో 48 గంటల్లో విక్రమ్ ల్యాండర్ వాస్తవ ఫొటోలు ఇస్రో శాస్త్రవేత్తల చేతికి అందబోతున్నాయి. నాసా ఇదివరకే అంతరిక్షంలోకి ప్రయోగించిన లూనార్ రికాయిన్నెసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్ఓ) విక్రమ్ ల్యాండర్ ఫొటోలను తీయబోతోంది. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఈ ఎల్ఆర్ఓ..చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగినట్లుగా భావిస్తోన్న ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను చిత్రీకరించబోతోంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా నాసా పూర్తి చేసింది. లూనార్ ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశానికి సంబంధించిన ఫొటోలు తమకు అందగానే.. వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తామని నాసా ఇదివరకే వెల్లడించింది.

తలకిందులుగా ఎలా?
చంద్రయాన్-2 లో భాగంగా ఇస్రో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఈ నెల 7వ తేదీన జాబిల్లి ఉపరితలంపై దిగాల్సి ఉంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ల్యాండర్ నుంచి సంకేతాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. అందులో నుంచి ఏ చిన్న సందేశం గానీ, సంకేతం గానీ బెంగళూరులోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్ కు అందలేదు. దీనితో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయినప్పటికీ.. తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. ల్యాండర్ కోసం అన్వేషణ ప్రారంభించారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిందని 36 గంటల తరువాత నిర్ధారించారు. హార్డ్ ల్యాండింగ్ కు గురై, తలకిందులుగా పడి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవంపై తాము సూచించిన ప్రదేశంలోనే హార్డ్ ల్యాండింగ్ కు గురైందని అన్నారు.

అనుసంధానం.. అసాధ్యమేనా?
అప్పటి నుంచి ల్యాండర్ తో అనుసంధానం కోసం చేస్తూ వచ్చిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. వేర్వేరు రూపాల్లో అనేక రేడియో సంకేతాలను పంపించినట్లు ల్యాండర్ నుంచి స్పందన రాలేదు. దీనితో నాసా రంగంలోకి దిగింది. ఇస్రోతో పోల్చుకుంటే అత్యంత శక్తిమంతమైన రేడియో సంకేతాలను నాసా సైతం విక్రమ్ ల్యాండర్ కు పంపినా ఫలితం రాలేదు. ఇక లాభం లేదనుకున్న నాసా.. ఇదివరకే తాను పంపించిన లూనార్ ఆర్బిటర్ ద్వారా ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని అణువణువూ పరిశీలించాలని నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగా.. లూనార్ ఆర్బిటర్ ను దక్షిణ ధృవం వైపు ప్రయాణించేలా సంకేతాలను పంపించింది. ప్రస్తుతం జాబిల్లి దక్షిణ ధృవం వైపు ప్రయాణిస్తోన్న ఈ లూనార్ ఆర్బిటర్.. మంగళవారం సాయంత్రానికి ల్యాండర్ దిగిన ప్రదేశం మీదుగా వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ సమయంలో..లూనార్ ఆర్బిటర్ లో అమర్చిన హై-రిజల్యూషన్ కెమెరాల ద్వారా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశం మొత్తాన్నీ ఫొటోలు తీస్తామని, వాటిని ఇస్రో శాస్త్రవేత్తలకు అందజేస్తామని నాసా వెల్లడించింది.

ఆ ఫొటోల ఆధారంగానే.. భవిష్యత్ కార్యాచరణ
నాసా తీసే ఫొటోలను పరిశీలించిన తరువాత విక్రమ్ ల్యాండర్ స్థితిగతులు ఎలా ఉన్నాయనే విషయంపై ఇస్రో శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు రావచ్చు. గ్రౌండ్ స్టేషన్ నుంచి తాము పంపిస్తోన్న సంకేతాలను ల్యాండర్ ఎందుకు గ్రహించట్లేదనే విషయమే ప్రస్తుతం వారిని పట్టి పీడిస్తోంది. సంకేతాను అందుకుంటే గానీ.. దానితో అనుసంధానం పొందడం కష్టమౌతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక్కసారి తమ సంకేతాలకు ల్యాండర్ స్పందిస్తే.. ఇక దాన్ని తమ అదుపులోకి తీసుకుని రావడం చిటికెలో పని అని అంటున్నారు. ల్యాండర్ తలకిందులుగా పడినట్లు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించినందున.. దాన్ని ఎలా మామూలు స్థితికి తీసుకుని రావాలనే దిశగా ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ల్యాండర్ విషయంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవాలనకున్నా.. మొదట దానితో అనుసంధానం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications