"ఖైదీల్లా వచ్చి వెళ్తున్నారు "- కాశ్మీర్ సేఫ్ అన్న బీజేపీ వ్యాఖ్యలకు ఫరూక్ అబ్దుల్లా కౌంటర్..!
జమ్మూ-కశ్మిర్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. దీంతో పాటే రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా పెరుగుతోంది. ఇదే క్రమంలో తమ హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమర్ధించుకుంటూ బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రాంతీయ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా తప్పుబట్టారు. అమర్ నాథ్ యాత్రకు కేంద్రం కల్పిస్తున్న భారీ భద్రతను బీజేపీకి ఆయన గుర్తుచేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని, కాశ్మీర్ ఇప్పుడు భద్రంగా ఉందంటూ బీజేపీ నేతలు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా జాతీయ మీడియా సంస్థ ఆజ్ తక్ నిర్వహించిన ఓ ఈవెంట్ లో స్పందించారు. అమర్ నాథ్ యాత్రకు కేంద్రం కల్పిస్తున్న భారీ భద్రతను గుర్తుచేస్తూ ఇక్కడికి యాత్రికులు ఖైదీల్లా వాహనాల్లో వస్తున్నారని, తిరిగి ఖైదీల్లాగే వాహనాల్లో వెళ్తున్నారని విమర్శించారు. గతంలో ఎప్పుడూ ఇంత భద్రత లేదన్నారు.

జమ్మూకశ్మీర్ పై ఐదేళ్లుగా పట్టు కొనసాగిస్తున్న కేంద్రం.. ఇక్కడ ఉగ్రవాదాన్ని మాత్రం అణచలేకపోయిందని ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. తాజాగా జూన్ లో యాత్రికుల బస్సుపై జరిగిన దాడిని ఇందుకు నిదర్శనంగా చూపారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఏదో ఒక రోజు తిరిగి ఆర్టికల్ 370ని సాధించుకుంటామని, అందుకు తొందరేమీ లేదని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. భారత్ కు కూడా 200 ఏళ్ల బ్రిటీష్ పాలన తర్వాత స్వాతంత్రం వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications