మోడీకి పాక్ ప్రధాని షరీఫ్ లేఖ: సోనియాకు ఊరట
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. ఇటీవలి భారత పర్యటన, నరేంద్ర మోడీతో జరిపిన సమావేశంపై ఈ లేఖలో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలపై చర్చించడానికి సానుకూల దృక్పథంతో ఎదురుచూస్తున్నట్లు ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.
రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని, తమ ప్రయత్నాలు ఇరుదేశాల శ్రేయస్సుకు ఉపయోగపడతాయని తాను బలంగా నమ్ముతున్నట్లు నవాజ్ షరీఫ్ తన లేఖలో పేర్కొన్నారు. మే 26న జరిగిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి షరీఫ్ హాజరైన విషయం తెలిసిందే. ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తీసుకున్న తర్వాత నరేంద్ర మోడీ.. షరీఫ్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

అయితే భారత పర్యటనలో నవాజ్ షరీఫ్ అంతగా సంతృప్తి చెందలేదని, సంతోషంగా లేరని పాకిస్థాన్ మీడియా ఇటీవల కొన్ని కథనాలను ప్రచురించింది. షరీఫ్‌కు భారత్‌లో సరైన మర్యాద లభించలేదని పాక్ మీడియా తమ కథనాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నవాజ్ షరీఫ్.. మోడీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది.
సోనియాకు ఊరట: కేసు కొట్టివేత
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై వేసిన కేసును అమెరికాలోని ఓ కోర్టు బుధవారం కొట్టేసింది. 1984లో ఢిల్లీలో జరిగిన సిక్కుల అల్లర్లకు సంబంధించి పలు ఆరోపణలతో సిక్కుల హక్కుల సంస్థ అమెరికాలోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. సరైన ఆధారాలు లేకపోవడంతో కొట్టివేసింది. కేసు కొట్టేస్తున్నట్లు అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ కోగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications