ఆ రాష్ట్రంలో కూడా బీజేపీకి ఓటమేనా?
కర్ణాటకలో భారతీయ జనతాపార్టీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాన్నే ఇతర రాష్ట్రాల్లోను అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంకేతాలిచ్చారు. కర్ణాటక ఫలితాలు వెలువడిన తర్వాతరోజే సీపీఐ నేత డి రాజాతో ముంబయిలోని తన నివాసంలో పవార్ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక నమూనాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని, దీనికోసం భావసారూప్యత కలిగిన పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు.

ఒక సందేశాన్ని పంపించాయి..: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఒక సందేశాన్ని పంపించాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఇదే పరిస్థితి కల్పించేందుకు కృషి చేయాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఒక్కటే బీజేపీకి ప్రత్యామ్నాయమని, అయితే ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా ఉన్నాయని, భావసారూప్యత ఉన్న పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై పని చేయాల్సి ఉందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. బీజేపీని ఓటమిపాలు చేసేందుకు ఉమ్మడి అవగాహన గురించి రాజాతో మాట్లాడామని, కర్ణాటక వ్యూహంతోపాటు కనీస ఉమ్మడి కార్యక్రమం కింద పనిచేస్తామన్నారు.

అక్కడ కూడా ఓటమే: రాష్ట్ర స్థాయిలో తగిన వ్యూహం రూపొందించుకోవచ్చని, ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడుకోవడానికి కొంత సమయం చూసుకోవాల్సి ఉందన్నారు. బీజేపీని ఓడించవచ్చని, 2024 సార్వత్రికతోపాటు మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందని శరద్ పవార్ జోస్యం చెప్పారు. బీజేపీని ఎవరూ ఓడించలేరు.. అది అజేయమైన పార్టీ అనే భావన ఉంటే కర్ణాటకతో అది పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకుందన్నారు. రెండు రోజుల క్రితం వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. మొత్తం 224 నియోజకవర్గాలకుగాను 135 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, 66 నియోజకవర్గాల్లో బీజేపీ, 19 నియోజకవర్గాల్లో జేడీఎస్, 4 నియోజకవర్గాల్లో ఇతరులు గెలుపొందారు.












Click it and Unblock the Notifications