బెంగళూరును నలువైపులా ముట్టడికి ప్లాన్: ఎన్ని రోజులైనా: మరో ఢిల్లీగా ఉద్యాననగరి
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు నిరసన ప్రదర్శనలు, ఉద్యమాలతో న్యూఢిల్లీ శివార్లను హోరెత్తిస్తోన్న రైతులు.. తమ ఆందోళనలను దక్షిణాది రాష్ట్రాలకు వ్యాపింపజేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని రైతు సంఘాలను సంప్రదిస్తున్నారు. తొలిదశలో ఉద్యాన నగరి బెంగళూరును ముట్టడించాలని నిర్ణయించుకున్నారు.
ఢిల్లీ తరహాలో బెంగళూరును కూడా ఘెరావ్ సిటీగా బదలాయిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిట్ ప్రకటించారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఏర్పాటు చేసిన రైతు సభలో ఆయన ప్రసంగించారు. లక్షలాది మంది రైతులు దేశ రాజధానిని ముట్టడించారని, ఇది సుదీర్ఘకాలం పాటు సాగే పోరాటమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ అదే తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని అన్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కావడం వల్ల దక్షిణాదిన తొలి విడతలో కర్ణాటకను ఎంచుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న రైతాంగ వ్యతిరేక విధానాలను అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ఢిల్లీ తరహాలో బెంగళూరు నలు వైపుల నుంచి ముట్టడించడానికి త్వరలోనే సన్నాహాలు చేస్తామని రాకేష్ టికాయిట్ స్పష్టం చేశారు. ఘెరావ్ బెంగళూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు.
ఎన్ని రోజులైనా ఘెరావ్ బెంగళూరు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను వరుసబెట్టి ప్రైవేటీకరించడానికి కుట్ర పన్నిన నరేంద్ర మోడీ ప్రభుత్వం.. వ్యవసాయ రంగాన్ని కూడా అదే విధంగా ప్రైవేటు కార్పొరేట్ల చేతుల్లో పెట్టడానికి పథకం పన్నారని ఆరోపించారు. అందులో భాగంగానే మూడు వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశారని మండిపడ్డారు. ఇటాంటి రైతాంగ, ప్రభుత్వ రంగ సంస్థల వ్యతిరేక విధానాలను మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications