కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాలో వ్యాక్సిన్ వేగం తగ్గించొద్దు: ప్రధాని మోడీ కీలక సూచనలు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం తగ్గకుండా రాష్ట్రాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలు, జిల్లాలవారీగా నెలకొన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య, మౌలిక సదుపాయాలు పెంచడానికి రాష్ట్రాలకు సహకారం, కరోనా ఔషధాల లభ్యతలపై ప్రధానంగా చర్చించారు. దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రాబోయే కొద్ది నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి రోడ్‌మ్యాప్‌పైనా చర్చ జరిపారు. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటి వరకు రాష్ట్రాలకు 17.7 కోట్ల టీకాలు సరపరా చేసినట్లు అధికారులు ప్రధానికి తెలియజేశారు. 45 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన జనాభాలో 31 శాతం మందికి తొలి మోతాదు టీకా ఇచ్చారని చెప్పారు. టీకా వృథాపై రాష్ట్రాల వారీగా ఉన్న పరిస్థితిని ఈ సందర్భంగా మోడీ ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు. పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ పౌరులు టీకా పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాని ఆదేశించారు.
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదని స్పస్టం చేశారు. కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమిడిసివిర్‌తోపాటు దేశంలో కరోనా మందుల కొరతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, దేశంలో గత 24 గంటల్లో 4 లక్షలకుపైగా కేసులు నమోదు కాగా, 3980 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications