మెడికల్ కోర్సులకు నీట్ ఒక్కటే అడ్మిషన్ టెస్ట్: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నీట్)పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. వైద్య విద్యాసంస్థల్లో, అన్ని వైద్య విద్య కోర్సుల్లో నీట్ మార్కులు ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మైనార్టీ విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీల్లో ప్రవేశాలకు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని సూచించింది.
దీంతో విద్యార్థులను చేర్చుకోవడంలో ఆయా విద్యాసంస్థలకు ఉన్న ప్రత్యేక హక్కులకు ఎలాంటి భంగం కలగదని వ్యాఖ్యానించింది. నీట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించడం వల్ల మైనార్టీ విద్యా సంస్థల హక్కుల్లో ఎలాంటి మత, భాషాపరమైన ఉల్లంఘనలను చోటుచేసుకోవని పేర్కొంది.

ప్రస్తుతం విద్య స్వచ్ఛంద సేవ అనే స్వభావాన్ని కోల్పోయి, ఒక వస్తువుగా మారిపోయింది. వ్యవస్థలో ఉన్న చెడును తొలగించి, అవినీతిని రూపుమాపడం కోసం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా నీట్ ప్రవేశపెట్టబడింది. ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్ర కౌన్సిలింగ్ ప్యానెల్ ద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేందుకు ప్రైవేటు కళాశాలలు నిరాకరించడాన్ని కోర్టు తప్పుపట్టింది. నీట్ మార్కుల ఆధారంగానే అన్ని మైనార్టీ, ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులను చేర్చుకోవాలని సూచించింది.
అంతేగాక, నీట్‌ను కాదని మరో పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని, ఇందుకోసం ఎలాంటి ప్రత్యేక అనుమతులు మంజూరు చేయలేం అని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అర్హత, ఆకాంక్ష కలిగిన వ్యక్తులకు న్యాయం చేయడం కోసం రాష్ట్రాలకు మైనార్టీ, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు రూపొందించే హక్కు ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.












Click it and Unblock the Notifications