NEET-UG 2026:వ్యవస్థపై నమ్మకం పోతోంది - నీట్ రద్దుపై స్టూడెంట్స్ రియాక్షన్..!!
దేశవ్యాప్త వైద్య విద్యా ప్రవేశ పరీక్ష 'నీట్ యూజీ 2026' రద్దు కావడం లక్షలాది మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. నెలల తరబడి పడ్డ కష్టం, అంకితభావం బూడిదలో పోసిన పన్నీరైందని అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
నిరాశలో విద్యార్థులు: 'శ్రమ వృథా అయ్యింది'
పరీక్ష రద్దు వార్త తెలియగానే కోటాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ హబ్‌లలో విషాద ఛాయలు అలముకున్నాయి."మా కష్టానికి విలువే లేదా?" అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. "ఇది కేవలం పరీక్ష రద్దు కాదు, మా భవిష్యత్తుతో ఆడుకోవడం. మళ్ళీ పరీక్ష పెడతారన్న గ్యారెంటీ ఏంటి? ఒకవేళ పెట్టినా మళ్ళీ ఇలాగే జరగదని నమ్మకం ఏంటి?" అని రాజస్థాన్‌లోని కోటాలో చదువుతున్న ఒక విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థపై పోతున్న నమ్మకం
కేవలం పరీక్ష రాసి ఇంటికి చేరిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి నిర్ణయం రావడం విద్యార్థుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసింది. లక్నోకు చెందిన ఒక అభ్యర్థి మాట్లాడుతూ.. "మేము చాలా నిరాశ చెందాం. పరీక్ష రాయడానికి సుదూర ప్రాంతాలకు ప్రయాణించి వెళ్లాం. ఇప్పుడు మళ్ళీ ప్రయాణాలు, మళ్ళీ అదే ఒత్తిడి.. ఇదంతా నరకంలా ఉంది. ఎన్‌టిఏ (NTA) పరీక్షా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది," అని పేర్కొన్నారు.
#WATCH | Lucknow, Uttar Pradesh: On NEET-UG 2026 exam cancelled due to allegations of paper leak, a NEET aspirant says, "We cannot do anything about it now that it has been suspended. We are disappointed... The NTA should change the medium of the exam... We will have to travel… pic.twitter.com/IzWdJ6mmr1
— ANI (@ANI) May 12, 2026
ఎన్‌టిఏ చీఫ్ వివరణ: 'అవమానకరమే కానీ తప్పదు'
ఈ పరిణామాలపై ఎన్‌టిఏ చీఫ్ అభిషేక్ సింగ్ స్పందిస్తూ, పరీక్ష రద్దు నిర్ణయం తీసుకోవడం తమకు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉందని అంగీకరించారు. "ఇది నిజంగా అవమానకరమైన పరిస్థితి. కానీ, పారదర్శకత మాకు ముఖ్యం. పేపర్ లీక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, మెరిట్ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తిస్తాం," అని ఆయన హామీ ఇచ్చారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) కావాలి
పాత పద్ధతిలో పేపర్ లీక్‌లు అరికట్టలేకపోతున్నారని, అందుకే తక్షణమే నీట్ పరీక్షను 'కంప్యూటర్ ఆధారిత పరీక్ష' (CBT) మోడ్‌లోకి మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది నెటిజన్లు ఎన్‌టిఏ తీరును ఎండగడుతున్నారు. "ఇదేమీ స్కూల్ టెస్ట్ కాదు, మా జీవిత కాల స్వప్నం" అంటూ గతంలో ఎన్‌టిఏ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఇప్పుడు వ్యంగ్యంగా రీ-పోస్ట్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
సుమారు 22.79 లక్షల మంది విద్యార్థుల ఆశలను మోస్తున్న నీట్ పరీక్ష ఇలా పదే పదే వివాదాల్లో చిక్కుకోవడం భారత విద్యా వ్యవస్థకే మచ్చగా మారుతోంది. 5,432 సెంటర్లలో జరిగిన ఈ మెగా ఎగ్జామ్ రద్దు కావడంతో, తదుపరి పరీక్ష ఎప్పుడు ఉంటుందనే దానిపై స్పష్టత లేక విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎన్‌టిఏ పకడ్బందీ చర్యలు చేపట్టి, విద్యార్థుల నమ్మకాన్ని పునరుద్ధరించాలని దేశం కోరుకుంటోంది.













Click it and Unblock the Notifications