New Coronavirus strain: అర్ధరాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం: క్వారంటైన్‌లో యూకే ప్రయాణికులు
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి ప్రపంచదేశాలు అల్లాడిపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సరికొత్తగా ఇది రూపాంతరం చెందడం ప్రకంపనలను పుట్టిస్తోంది. కరోనా వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 17 లక్షలకు మందికి పైగా మరణించగా.. కేసులు ఎనిమిది కోట్లకు చేరువ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కొత్తగా కరోనా వైరస్ స్ట్రెయిన్ పుట్టుకు రావడం పట్ల భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. భారత్ సహా అనేక దేశాలు బ్రిటన్ నుంచి విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేశాయి.
ఈ పరిస్థితుల్లో బ్రిటన్ నుంచి వచ్చిన వారిని వచ్చినట్టే ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను సైతం జారీ చేసింది. వాటిని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాలకు సూచించింది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిని విమానాశ్రయాల్లోనే అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని ప్రత్యేకంగా 14 రోజుల క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ, బెంగళూరులోని కెంపెగౌడ, చెన్నె, తిరువనంతపురం విమానాశ్రయాల్లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులను క్వారంటైన్‌కు తరలించడానికి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత బ్రిటన్ నుంచి ముంబైకి చేరుకున్న ప్రయాణికులందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రత్యేక బస్సులో క్వారంటైన్‌కు తరలించారు. దీనికోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను విమానాశ్రయం వద్ద మోహరింపజేశారు. ప్రయాణికుల పాస్‌పోర్ట్, విసాలను పరిశీలించిన తరువాత వారిని క్వారంటైన్‌కు తీసుకెళ్లారు.

దీనిపట్ల ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలిస్తారనే సమాచారం తమకు లేదని అంటున్నారు. ముందస్తు సమాచారాన్ని ఇవ్వలేదని చెబుతున్నారు. ముంబై చేరిన వెంటనే క్వారంటైన్‌కు తరలిస్తారని ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే.. తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకునే వాళ్లమని స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్ విమానాశ్రయాల్లో ఇప్పటిదాకా ఎలాంటి నిబంధనలు లేవని, ఇక్కడికి వచ్చిన తరువాతే తమను క్వారంటైన్‌కు తరలిస్తున్నట్లు చెప్పారని అంటున్నారు.

బ్రిటన్ సహా యూరప్, మధ్య తూర్పు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటు ఇన్‌స్టిట్యూషనల్ క్వారెంటైన్‌లో ఉండాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం దేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ముంబూ పోలీసులు బ్రిటన్ నుంచి వచ్చిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నవారికి చికిత్స అందించడానికి ఆసపత్రులను ఏర్పాటు చేయనుంది.












Click it and Unblock the Notifications