పొగమంచు కాదు.. కాలుష్యం పొగ, డేంజర్ జోన్ లో ఢిల్లీ..
దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం ప్రజలు పొగమంచు పొరలను చూస్తూ నిద్రలేచారు. ఉదయం 10 గంటలైనా ఇంకా తెల్లవారలేదేమో అన్నట్లుగా ఉంది అక్కడి వాతావరణం.
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం ప్రజలు పొగమంచు పొరలను చూస్తూ నిద్రలేచారు. ఉదయం 10 గంటలైనా ఇంకా తెల్లవారలేదేమో అన్నట్లుగా ఉంది అక్కడి వాతావరణం.
200 మీటర్ల దూరం నుంచి వస్తున్న వాహనాలు కూడా కనబడనంత దట్టంగా పొగ అలుముకుంది. అయితే ఇదంతా పొగమంచు కాదట. కాలుష్యం కారణంగా ఏర్పడిన పొగ అని వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.

అది కాలుష్యం పొగ...
ఢిల్లీలో అలుముకున్న పొగ.. మంచు కారణంగా కాదని.. కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందని అధికారులు తెలిపారు. ఈ ఉదయం పరిస్థితి సాధారణంగానే కన్పించినా.. 9.30 గంటల ప్రాంతంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తీవ్ర ఇబ్బందిలో వాహనదారులు..
ఢిల్లీలోని ఇండియాగేట్, రాజ్‌పథ్, ఎన్‌సీఆర్, గురుగ్రామ్ ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కన్పించకపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది.

ఉదయం 10 గంటలకూ..
కొంతమంది ఢిల్లీ వాసులు ఈ కాలుష్యం పొగకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల సమయంలోనూ పొగ అంతే స్థాయిలో ఉందని.. మధ్యాహ్నానికి తేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ...
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పు కలిగించే పీఎం 2.5 స్థాయి ఢిల్లీలో 703కు చేరుకుందని అమెరికన్ ఎంబసీ వెబ్‌సైట్ పేర్కొనడంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అప్రమత్తమై ఢిల్లీ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

కొద్దిరోజులు వాకింగ్, జాగింగ్ బంద్..
ఉదయపు నడక, జాగింగ్‌ను కొద్దిరోజుల పాటు నిలిపివేయాలని వాకర్లకు సూచించింది. స్కూళ్లకు కొద్దిరోజులు సెలవులు ప్రకటించాలని సీఎం కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కోరారు. చిన్నారులను ఆరుబయట ఆటలకు వెళ్లనీయవద్దని వైద్యులు కూడా సూచించారు.

హాఫ్ మారథాన్‌ను నిలిపివేయండి..
ఈ నెలలో నిర్వహించ తలపెట్టిన హాఫ్ మారథాన్‌ను నిలిపివేయాలని ప్రభుత్వానికి ఇండియన్ మెండికల్ అసోసియేషన్ (ఐఎంఏ)విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) పెచ్చుమీరిందని, దీని బారి నుంచి రన్నర్లు, వాలంటీర్లను కాపాడేందుకు ఈనెల 19న జరగాల్సిన పరుగును రద్దు చేయాలని కోరింది.












Click it and Unblock the Notifications