ఢిల్లీలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం... యాంటీబాడీలున్నా ప్రభావం
దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉన్నప్పటికీ ఢిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా నిత్యం రెండువేలకు పైగా కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. పరీక్షల్లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడినట్లు లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ ఆసుపత్రి అధికారులు తెలిపారు. కొంతమందిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న బీఏ 2.75 ను గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు.
ఈ వేరియంట్ యాంటీబాడీలు ఉన్నవారిలోను, టీకాలు తీసుకున్నవారిపైనా ప్రభావం చూపుతుందని డాక్టర్ సురేష్ తెలిపారు. అనుమానంతో 90 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించామని, ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ 2.75 ను గుర్తించామన్నారు. టీకాలు తీసుకున్నా, యాంటీబాడీలున్నా ప్రభావం ఉంటుందన్నారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో 24 గంటల వ్యవధిలోనే 2445 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఫిబ్రవరి నుంచి ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో నమోదైన కేసులు ఇవే. పాజిటివిటీ రేసు 15.41కి చేరింది. ఇప్పటివరకు వైరస్ తో ఏడుగురు మరణించారు.

ప్రముఖులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు రెండుసార్లు వైరస్ సోకింది. రాజస్థాన్ పర్యటనకు వెళ్లాల్సిన రాహుల్ గాంధీ అనారోగ్యంతో తన టూర్ ను వాయిదా వేసుకున్నారు. 24 గంటల వ్యవధిలోనే దేశంలోనే 17వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications