New Parliament : నెలాఖరులో కొత్త పార్లమెంట్ ప్రారంభం- మోడీ 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇప్పటివరకూ వాడుతున్న పార్లమెంటు భవనం పాతది కావడంతో దాని స్ధానంలో మరో కొత్త భవనాన్ని మూడేళ్లుగా నిర్మిస్తున్నారు. ఇది తాజాగా నిర్మాణం పూర్తి చేసుకోవడంతో ప్రారంభోత్సవం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
భారత పార్లమెంటు కొత్త భవనాన్ని ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మోడీ సర్కార్ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా చివరి దశలో ఉన్న పార్లమెంట్ కొత్త భవనాన్ని మే చివరి వారంలో ప్రధాని ప్రారంభిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం మే 26, 2014న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 25న మోడీ సర్కార్ 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటుంది. దీంతో ఈ రెండు తేదీల్లో ఒకరోజు ప్రారంభోత్సవం చేసే అవకాశాలున్నాయి.

భారత కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.970 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. మొత్తం నాలుగు అంతస్తుల భవనంలో 1,224 మంది ఎంపీలు కూర్చునేలా దీన్ని నిర్మించారు. భారత ప్రజాస్వామ్య వారసత్వమైన ఈ భవనంలో భోజన ప్రాంతాలు , విస్తారమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అలాగే కొత్త పార్లమెంటులోకి మారాక ఉభయ సభల్లోని సిబ్బంది కొత్త యూనిఫామ్‌లోకి మారబోతున్నారు. దీనిని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రూపొందిస్తోంది.
పార్లమెంట్ కొత్త భవన నిర్మాణంలో మూడు తలుపులు ఉన్నాయి. జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్. అలాగే ఎంపీలు, వీఐపీలు, సందర్శకుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త పార్లమెంట్ భవనానికి 2020 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మోడీ తొమ్మిదేళ్ల పాలనకు గుర్తుగా బీజేపీ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ భవనం ప్రారంభం కూడా ఉండబోతోంది.












Click it and Unblock the Notifications