పోస్ట్ కోవిడ్ బాధితులకు ఫ్యాటీ లివర్; మద్యం తాగనివారిలోనూ; ప్రతి ఇంట్లో ఒకరికి డిసీజ్!!
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం లివర్. కాలేయం సుమారుగా 600 రకాల పనులను ప్రతిరోజు చేస్తుందంటే నమ్మి తీరాల్సిందే. శరీరం నుండి టాక్సిన్లను బయటకు పంపడంలో, శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కాలేయం. ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, కాలేయ వ్యాధులు మరియు వాటి నివారణపై అవగాహన కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలా వరకు కాలేయ వ్యాధులు నివారించబడతాయి. కాకుంటే సరైన సమయంలో వాటిని గుర్తించి తగిన విధంగా వాటికి చికిత్స అందిస్తే, మన జీవనశైలిని మార్చుకుంటే కాలేయ వ్యాధి నుంచి బయట పడవచ్చు. అయితే తాజాగా కరోనా తర్వాత మద్యం సేవించని వారిలోనూ ఫ్యాటీ లివర్ సమస్య గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది.

మద్యం సేవించని వారిలోనూ ఫ్యాటీ లివర్
ఇక తాజాగా భారత దేశంలో కరోనా మహమ్మారి కారణంగా అమలవుతున్న వర్క్ ఫ్రం హోం విధానం మరియు లాక్‌డౌన్ సమయంలో కదలిక లేకపోవడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు పెరిగాయి. ఆల్కహాల్ సంబంధిత వ్యాధి తర్వాత సాధారణంగా సంభవించే కాలేయ వ్యాధి ఫ్యాటి లివర్, ముఖ్యంగా ఆల్కహాల్ త్రాగని వారిలోనూ ఇది వస్తుంది. మొత్తం 40% మంది రోగులు ఈ రకమైన ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక తాజా పరిస్థితులపై వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక దశాబ్దం క్రితం, తాము నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి కేసులను చాలా అరుదుగా చూసామని, 10 కేసులలో ఒకటి ఫ్యాటీ లివర్ కేస్ ఉండేదని చెప్తున్నారు. ఇప్పుడు 10 కేసులలో నాలుగు నుండి ఐదు వరకు ఫ్యాటీ లివర్‌కు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు.

నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తో పెరుగుతున్న ఆందోళన
గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మరియు తర్వాత, చాలా మంది ప్రజలు ఇంటి నుండి పని చేస్తున్నారు కాబట్టి మేము కేసులు బాగా పెరగడం చూసామని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లు చెబుతున్నారు. కదలక మెదలక ఒకేచోట కూర్చుని పనికి పరిమితమవుతున్న పరిస్థితి, మనుషుల జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా కేసులు పెరుగుతున్నాయి. ఊబకాయం, మధుమేహం, డైస్లిపిడెమియా కూడా ఫ్యాటీ లివర్ పెరగడానికి ప్రధాన కారణాలు అని వైద్యులు చెబుతున్నారు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ తీవ్రమైన ఆందోళనగా మారిందని, ఇది గుండె సంబంధిత వ్యాధులకు స్వతంత్ర ప్రమాద కారకంగా మారిందని వైద్యులు తెలిపారు.

ప్రతి కుటుంబంలో ఒకరికి ఫ్యాటీ లివర్
ప్రతి కుటుంబంలో దాదాపు ఒక వ్యక్తి నేడు ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కొలెస్ట్రాల్ లాగానే ఇది గుండె సంబంధిత వ్యాధులకు స్వతంత్ర ప్రమాద కారకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్న గుండె సంబంధిత సమస్యలు ఫ్యాటి లివర్ కారణంగానే అని వారంటున్నారు. అల్ట్రాసౌండ్ చాలా మంది రోగులలో, ముఖ్యంగా చిన్నవారిలో కూడా దీనిని గుర్తిస్తుంది.ఫ్యాటీ లివర్‌ను ముందుగానే గుర్తించి పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, కాలేయ వ్యాధులు ప్రారంభ దశల్లో లక్షణాలు కనిపించవు. ఫ్యాటి లివర్ వ్యాధికి కారణం యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత మరియు సూక్ష్మ పోషకాల అసమతుల్యత.

పోస్ట్ కోవిడ్ బాధితుల్లో మూడు నాలుగు నెలల తర్వాత ఫ్యాటీ లివర్
జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడే అవకాశాలు ఎక్కువ. బరువు తగ్గడం కోసం కొన్ని మందులు తీసుకున్నా జుట్టు, చర్మం మొదలైనవాటికి తీసుకునే మందులు కూడా ఒక్కోసారి ఫ్యాటీ లివర్ కు కారణమవుతాయి. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న రోగులలో రెండు మూడు నెలల తర్వాత ఫ్యాటీ లివర్ వ్యాధి ని గుర్తించినట్లుగా తెలుస్తుంది. కోవిడ్ -19 శ్వాసకోశ వ్యవస్థపై మాత్రమే కాకుండా కాలేయంపై కూడా ప్రభావం చూపుతుంది అని తాజా కేసులను బట్టి వైద్యులు గుర్తించారు

ఫ్యాటీ లివర్ తగ్గాలంటే జీవన శైలిలో మార్పులు అవసరం
ఫ్యాటీ లివర్‌ను రివర్స్ చేయడానికి జీవనశైలిలో మార్పులు చేయాలని వైద్యులు సలహా ఇచ్చారు. ముందుగానే రోగనిర్ధారణ చేస్తే పూర్తిగా రివర్స్ చేయవచ్చు. కాలేయం పునరుత్పత్తి కాగల అవయవం. ఇది గాయం నుండి త్వరగా కోలుకుంటుంది . దానంతటదే పునరుత్పత్తి చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, మద్యం మరియు అనవసరమైన మందులకు దూరంగా ఉండటం, మధుమేహం నియంత్రణ వంటి చర్యల ద్వారా ఫ్యాటీ లివర్ ను నివారించవచ్చని చెబుతున్నారు. కాలేయం ఆరోగ్యంగా ఉంటే అది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications