‘పరువు హత్యలు తప్పుకాదు! మీకు నేనున్నా’
చెన్నై: పరువు హత్యలు చేయడం తప్పుకాదని, అటువంటి వారు తమ వద్దకు వస్తే, కాపాడతానని చెబుతూ తమిళనాడులోని విల్లుపురానికి చెందిన టీఎస్ అరుణ్ కుమార్ అనే న్యాయవాది పేర్కొన్నాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు పెట్టడం కలకలం రేపింది. ఈ పోస్టుతో పాటే తన ఈ-మెయిల్ ఐడీని కూడా ఆయన పోస్ట్ చేయడం గమనార్హం.
'పరువు తీసినందుకు వేసే శిక్షే పరువు హత్య. ఇంటి పరువు తీసిన వారిని హత్య చేసే హక్కు తల్లిదండ్రులకు వుంది. ఇలాంటి హత్య చేసిన వారు ఏమీ బాధపడొద్దు. నా వద్దకు రండి. మీ కేసు నేను తీసుకుంటాను. అదేమీ నేరం కాదు' అని వ్యాఖ్యానించాడు.
కాగా, ఈ పోస్టును చూసిన సామాజిక కార్యకర్త గీతా నారాయణన్, చెన్నై పోలీసు కమిషనర్ కు దాన్ని ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆయన ఖాతాను మూసివేయించి నోటీసులు పంపారు.

ఇది ఇలా ఉండగా, తమిళనాడులో పరువు హత్యలకు మద్దతిస్తున్నవారి సంఖ్య వందల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. గత వారంలో కౌసల్య ప్రాంతంలో అగ్రకుల యువతిని వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ, ఓ దళిత యువకుడిని కొట్టి చంపిన సంగతి తెలిసిందే.
ఈ హత్య చేసిన వారిని అభినందిస్తూ, వందలాది మంది పోస్టులు పెట్టినట్టు ఆందోళన కలిగించే అంశం కాగా.. పరువు హత్యల ఘటనలపై రాజకీయ పార్టీల నాయకులు స్పందించకపోవడం గమనార్హం.
2013 నుంచి తమిళనాట 80 మంది యువతీ, యువకులను పరువు పేరిట వారి సొంత బంధువులే హత్యలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, పరువు హత్యలు చేసిన వారికి ఉరితాళ్లు సిద్ధంగా ఉంటాయని గతంలో సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం దురదృష్టకరం.












Click it and Unblock the Notifications