ఫాస్టాగ్ పై కేంద్రం గుడ్ న్యూస్- ఇక నో కన్ఫ్యూజన్
ఫాస్టాగ్ పై జాతీయ రహదారుల సంస్థ తాజా ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లోకల్ నెలవారీ పాస్, వార్షిక పాస్ ల లభ్యత, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రదర్శించాలని సూచించింది. ఫాస్టాగ్ పాసుల విషయంలో వాహనదారులకు అవగాహన కల్పించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనివల్ల పారదర్శకంగా వాటిని జారీ చేసినట్టవుతుందని భావిస్తోంది. ఈ మేరకు ఫీల్డ్ కార్యాలయాలన్నింటికీ ఉత్తర్వులు ఇచ్చింది.
స్థానిక నెలవారీ పాస్, వార్షిక పాస్ సౌకర్యాల లభ్యత, వాటి ధరలు, పొందే విధానాలపై వాహనదారులకు పూర్తి సమాచారం అందించాలనేది జాతీయ రహదారుల సంస్థ ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించిన సమాచారాన్ని టోల్ ప్లాజా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, కస్టమర్ సర్వీస్ ప్రాంతాల్లో సైన్ బోర్డుల ద్వారా ప్రదర్శిస్తారు. ఎన్ని పాస్ లు జారీ అయ్యాయనేది కూడా ఇందులో అప్పటికప్పుడు పొందుపరుస్తారు.

ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక ప్రాంతీయ భాషల్లో ఈ సైన్ బోర్డులు/ఎలక్ట్రానిక్ డిస్ ప్లేలను అమర్చాల్సి ఉంటుంది. ఉత్తర్వులు అందిన రోజు నుంచి సరిగ్గా నెల రోజుల్లో టోల్ ప్లాజాల వద్ద వీటిని ఏర్పాటు చేయాలని, నిబంధనలకు లోబడి పగటి పూట, రాత్రి వేళల్లో వాహనదారులందరికీ స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలని జాతీయ రహదారుల సంస్థ ఆదేశించింది.
ఫాస్టాగ్ పాసులపై విస్తృత ప్రచారానని కల్పించడంలో భాగంగా ఈ సమాచారాన్ని రాజ్ మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్, ఎన్‌హెచ్‌ఏఐ, దాని అనుబంధ శాఖలు, విభాగాలకు సంబంధించిన వెబ్‌సైట్లల్లో కూడా అప్‌లోడ్ చేస్తారు. టోల్ ప్లాజాకు 20 కిలో మీటర్ల పరిధిలో నివసించే ప్రైవేట్ వాహనదారులు ఆధార్ కార్డు, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, నివాస చిరునామా రుజువు వంటి పత్రాలను సమర్పించి లోకల్ పాస్ ను పొందవచ్చు.
ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించిన ప్రకారం- ఈ నెలవారీ పాస్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ తర్వాత టోల్ ప్లాజా హెల్ప్ డెస్క్ వద్ద లోకల్ మంత్లీ పాసులను వాహనదారులకు అందజేస్తారు. అదేవిధంగా- వార్షిక పాస్‌ను రాజ్‌మార్గయాత్ర అప్లికేషన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 3,000 రూపాయల మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన తర్వాత వాహనానికి జతచేసిన వాల్యుడ్ డాక్యుమెంట్ల ఆధారంగా ఫాస్ట్‌టాగ్‌పై డిజిటల్ పాస్ ను యాక్టివేట్ చేస్తారు. ఈ వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద చెల్లుబాటు అవుతుంది.












Click it and Unblock the Notifications