బుర్ద్వాన్ పేలుళ్ల కేసు: కీలక నిందితుడ్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌లో జరిగిన పేలుళ్ల కేసులో కీలక నిందితుడు షహనూర్ ఆలంను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది. గడిచిన కొద్ది రోజులుగా పేలుళ్ల ఘటన సవాల్‌గా తీసుకున్న ఎన్ఐఏ.. గతంలో అరెస్టైన ఉగ్రవాదులు, నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమీ కార్యకర్తలను కూడా ప్రశ్నించింది.
ఈ క్రమంలో మయన్మార్ ఉగ్రవాది మహ్మద్ ఖలీద్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు షహనూర్‌ను అసోంలో అరెస్ట్ చేశారు. ఈ పేలుళ్ల ఘటనలో సంబంధం ఉన్న ఉగ్రవాదుల కుటుంబసభ్యులను కూడా అరెస్ట్ చేసి కష్టడీలో ఉంచిన అధికారులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ పట్టణంలోని ఖాగ్రాగఢ్‌లోని ఓ ఇంటిలో అక్టోబర్ 2న బాంబు పేలుడు సంభవించి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితుడు సాజిద్‌ను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయగా, మయన్మార్ ఉగ్రవాది మహ్మద్ ఖలీద్‌ను ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
ఇది ఇలా ఉండగా కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి నుంచి దోపిడీకి గురైన సొత్తు సహా, దేశంలోని మరికొన్ని చోట్ల జరిగిన వ్యవహారాలలోనూ బుర్ద్వాన్ పేలుళ్ల ఘటనకు సంబంధం ఉన్నట్లుగా ఇప్పటికే విచారణలో తేటతెల్లమైంది. ఉగ్రవాదులు దోపిడీ సొమ్మును బాంబుల తయారీకి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లు జరిపేందుకు వినియోగిస్తున్నట్లుగా ఎన్ఐఏ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications