నిర్భయ కేసు: 4గురికి ఉరిశిక్షను సమర్థించిన హైకోర్టు

డిసెంబర్ 16, 2012న నిర్భయ పైన ఆరుగురు యువకులు బస్సులో ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె స్నేహితుడిని కొట్టి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె పట్ల దారుణంగా వ్యవహరించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు, యువత నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. ఆమె డిసెంబర్ 29, 2012న సింగపూర్ ఆసుపత్రిలో మృతి చెందింది.
ఈ కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆరు నెలల క్రితం తీర్పు చెప్పింది. దీనిపై నిందితులు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇప్పుడు హైకోర్టు ఆ తీర్పును సమర్థించింది. గురువారం మధ్యాహ్నం జస్టిస్ రేవా ఖేత్రపాల్, జస్టిస్ ప్రతిభా రాణిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును సమర్థించింది.
ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉన్నారు. వారిలో ఒక నిందితుడు జైలులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్. మిగిలిన నలుగురికి ఉరిశిక్షను ఖరారు చేశారు. ముఖేష్ (26), అక్షయ్ ఠాకూర్ (28), పవన్ గుప్త (19), వినయ్ శర్మ (20)లు నిందితులు.












Click it and Unblock the Notifications