బెంగాల్ పై ప్రధాని మోదీ మాస్టర్ స్ట్రోక్
పశ్చిమ బెంగాల్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మొత్తం 152 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 142 స్థానాలకు ఈ నెల 29వ పోలింగ్ జరుగనుంది. ఈ పరిణామాల మధ్య ప్రధాని మోదీ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. నీతి ఆయోగ్‌ను పునర్వ్యవస్థీకరించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ లాహిరిని ఏకంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా నియమించారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
ఈ నియామకం.. బెంగాల్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన సొంత నియోజకవర్గం.. బలుఘాట్. 2021 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయట్లేదు. నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడితో పాటు ఇతర సభ్యుల నియామకాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారికి విషెస్ తెలిపారు.

అలాగే పశ్చిమ బెంగాల్ కే చెందిన ప్రముఖ ఇమ్యునాలజిస్ట్, విద్యావేత్త గోబర్ధన్ దాస్ కూడా నీతి ఆయోగ్ సభ్యుడిగా అపాయింట్ అయ్యారు. 2021లో బీజేపీ తరపున బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారాయన. గతంలో భోపాల్ ఐఐఎస్ఈఆర్ డైరెక్టర్‌గా, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ గా పనిచేశారు.
పునర్వ్యవస్థీకరించిన నీతి ఆయోగ్ సభ్యులుగా గోబర్ధన్ దాస్ తో పాటు రాజీవ్ గౌబా, ప్రొఫెసర్ కే వీ రాజు, ప్రొఫెసర్ అభయ్ కరంధేకర్, డాక్టర్ ఎం శ్రీనివాస్ నియమితులయ్యారు. వారందరూ పూర్తికాల సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. వీరందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. నీతి ఆయోగ్ కు మరింత పదును పెట్టాలని సూచించారు. ఫలవంతం, ప్రభావవంతంగా తీర్చిదిద్దాలని, ఈ దిశగా తమ పూర్తి పదవీకాలం కృషిచేయాలని ఆకాంక్షించారు.
విధాన రూపకల్పనలో నీతి ఆయోగ్ కీలకమైన స్థంభంగా మారిందని మోదీ గుర్తు చేశారు. ఇది సహకార- సమాఖ్యవాదాన్ని బలోపేతం చేస్తుందని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ముందుకు నడుపుతుంది, ఆర్థిక వ్యవస్థకు ఓ చుక్కానిగా మారిందని పేర్కొన్నారు. అన్ని రంగాలలో వినూత్న, దీర్ఘకాలిక వ్యూహాత్మక ఆలోచనలకు నీతి ఆయోగ్ ఓ సమగ్ర, సమర్థ వేదిక అని అభివర్ణించారు.












Click it and Unblock the Notifications