బుల్లెట్ ప్రూఫ్ లేకుండా మోడీ ప్రసంగం: కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఎర్రకోటపై తొలిసారిగా జాతీయ జెండాను ఎగురవేసిన ఆయన తన విలక్షతను చాటుకున్నారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని హోదాలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి శుక్రవారం ఉదయం నరేంద్ర మోడీ ప్రసంగించారు. అయితే ఎటువంటి రక్షణ కవచం(బుల్లెట్ ప్రూఫ్) లేకుండా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం.
ఇంతకుముందు ప్రధానిగా పని చేసిన మన్మోహన్ సింగ్ బుల్లెట్ ప్రూఫ్ అద్దం వెనక నుంచి ప్రసంగించారు. అయితే మోడీ ఆ రక్షణ కవచం లేకుండానే తనదైన శైలిలో పేజీలకు పేజీలు కాకుండా ప్రసంగించారు. కాషాయ రంగు తలపాగా, క్రీమ్ కలర్ పైజామా, తెలుపు రంగు లాల్చీ ధరించి గుజరాతీ సాంప్రదాయ ఆహార్యంతో వచ్చిన మోడీ, తన ప్రసంగంతో యావత్ దేశాన్ని ఆకట్టుకున్నారు. ప్రసంగ పాఠాన్ని చదవకుండా ఆశువుగా ప్రసంగించారు. కాగా, మోడీ తొలి పంద్రాగస్టు ప్రసంగంపై సోషల్ మీడియాలో ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.
ఎర్రకోట ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యువతపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు బయటికి వెళ్లి ఆలస్యంగా వస్తే ప్రశ్నించే తల్లిదండ్రులు... అబ్బాయిలు బయటికి వెళ్తే మాత్రం ప్రశ్నించడం లేదని మోడీ అన్నారు.

యువత... ముఖ్యంగా అబ్బాయిలు చెడు మార్గం పట్టకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ వ్యాఖ్యానించారు. అబ్బాయిల పెంపకంలో తల్లిదండ్రుల వహిస్తున్న అజాగ్రత్తే మహిళలపై జరుగుతోన్న దాడులకు ప్రధాన కారణమని మోడీ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు తన మనసును కలచివేస్తున్నాయని మోడీ పేర్కొన్నారు.
మగ, ఆడపిల్లల నిష్పత్తిలో వస్తోన్న తేడా తనను ఆందోళనకు గురిచేస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల సంఖ్య రోజురోజుకీ తగ్గుతోందన్నారు. దీని వల్ల సమాజంలో అసమతుల్యత ఏర్పడుతుందని ఆయన తెలిపారు. ఆడశిశువుల భ్రూణ హత్యలకు పాల్పడవద్దని ఆయన డాక్టర్లను కోరారు.
అలాగే పుట్టేది ఆడశిశువు అని తెలియగానే ఆబార్షన్ చేయించుకోవద్దని ఆయన తల్లిదండ్రులను వేడుకున్నారు. ఐదుగురు కొడుకులున్న తల్లిదండ్రుల కంటే, ఒక్క కూతురున్న తల్లిదండ్రులు ఎంతో సుఖంగా ఉండటం తాను అనేక చోట్ల చూశానని మోడీ అన్నారు.












Click it and Unblock the Notifications