ఇండియాలో అందరూ పెళ్లి కొడుకులే.. మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో మాట్లాడారు. దీనిపై మూడు రోజుల పాటు జరిగిన చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సమాధానం ఇచ్చారు. 2024లో మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి రాబోతోందని మోదీ జోస్యం చెప్పారు.
2014, 2019 ఎన్నికల్లో కంటే అత్యధిక స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, గత రికార్డులన్నింటినీ చెరిపివేస్తామంటూ ధీమాగా చెప్పారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మోదీ తప్పుపట్టారు. అసలు ఎలాంటి చర్చ పెట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విపక్షాలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ వచ్చాయని పేర్కొన్నారు.

ప్రతిపక్షాలు తమ టీమ్‌ను సరిగ్గానే ఆర్గనైజ్ చేసుకున్నప్పటికీ- ఫోర్లు, బౌండరీలను కొట్టడం మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు మోదీ. దేశ ప్రజలు తమ ప్రభుత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని, 2014లోనే కాకుండా.. ఆ తరువాతి ఎన్నికల్లోనూ సంపూర్ణ మెజారిటీతో తమను గెలిపించారని మోదీ గుర్తు చేసుకున్నారు.
కొన్ని ప్రతిపక్ష పార్టీలకు ఇవేవీ పట్టట్లేదని, పని చేసే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తోన్నాయని మోదీ విమర్శించారు. అందులో భాగంగానే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని చెప్పారు. పేదల ఆకలికి బదులుగా ఎంతసేపు తమ అధికార దాహాన్ని తీర్చుకోవడానికే ప్రయత్నిస్తోన్నాయని ధ్వజమెత్తారు.
తన ప్రసంగంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష కూటమి ఇండియాపై సెటైర్లు వేశారు. ఇండియా కూటమిలో అందరూ పెళ్లి కొడుకులే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది ఇండియా కూటమి కాదని, ఘమ్ ఇండియా కూటమిగా అభివర్ణించారు. స్వార్థపూరితమైనదిగా పేర్కొన్నారు. ఈ కూటమిలో అందరూ పెళ్లి కొడుకులే ఉన్నారని వ్యాఖ్యానించారు.

తమ కూటమి NDA అనే పదానికి ప్రతిపక్షాలు I అనే అక్షరాన్ని జోడించారని, ఇది వారి స్వార్థానికి అద్దం పడుతోందని మోదీ విశ్లేషించారు. తమ స్వార్థం, అహంకారం అనేవి.. ఈ Iలో ప్రస్ఫూటంగా కనిపిస్తోందంటూ మండిపడ్డారు. బెంగళూరులో యూపీఏకు అంత్యక్రియలను నిర్వహించారని, వారికి సానుభూతిని తెలియజేస్తోన్నానని మోదీ చురకలు అంటించారు.
మోదీ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మణిపూర్‌పై మాట్లాడటానికి నోరు పెగలని ప్రధాని.. తమపై విమర్శలు చేయడానికి ఒంటికాలి మీద లేస్తోన్నారంటూ ధ్వజమెత్తాయి. భారత్ అంటే కేవలం ఎన్డీఏ మాత్రమే కాదంటూ తేల్చి చెప్పాయి. మోదీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేశాయి.












Click it and Unblock the Notifications