ఐదేళ్లలోపు చిన్నారులకు కోవిట్ టెస్టు అవసరం లేదు: వారి కోసం కేంద్రం తాజా మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా పరీక్షల విషయంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు కోవిడ్ టెస్టుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణానికి ముందు లేదా భారత్ చేరుకున్న తర్వాత కూడా వారికి కోవిడ్ టెస్టులు అక్కర్లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ ప్రయాణాలపై ఇదివరకున్న కోవిడ్ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది.
అయితే, భారత్ చేరుకునే సమయానికి ఒకవేళ కోవిడ్ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. అలాంటి చిన్నారులకు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. తాజా మార్గదర్శకాలు నవంబర్ 12 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ అమలులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు, ఇతర దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన వ్యాక్సిన్లను తీసుకుని భారత్ వచ్చే వారికి భారత ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ముఖ్యంగా భారత్‌తో పరస్పర అవగాహన కలిగిన దేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయంలో ఎటువంటి నిబంధనలు ఉండవు. విమానం దిగిన వెంటనే కోవిడ్ టెస్టులు అవసరం లేకుండా నేరుగా బయటకు వెళ్లిపోవచ్చు. హోంక్వారంటైన్ కూడా ఉండనవసరం లేదు.
కానీ, ఆయా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 15 రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండాలని సవరించిన మార్గదర్శకాల్లో భారత ప్రభుత్వం వెల్లడించింది. ఒకవేళ ఒకే డోసు తీసుకున్నా.. లేదా పూరత్ిగా కోవడ్ టీకా తీసుకోని వారు మాత్రం విమానాశ్రయంలో కోవిడ్ పరీక్షకు నమూనాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాక, ఏడురోజులపాటు హోంక్వారంటైన్ ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Recommended Video
కాగా, దేశంలో కరోనావైరస్ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,091 కేసులు నమోదయ్యాయి. నిన్న 340 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,38,556 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 266 రోజుల తర్వాత దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా తగ్గినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది. తాజాగా నమోదైన గణాంకాలతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,44,01,670 కి చేరగా.. మరణాల సంఖ్య 4,62,189 కి పెరిగినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. నిన్న కరోనా నుంచి 13,878 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,38,00,925 కి పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications