విజయ్ మాల్యాకు ఝలక్: రాజీనామా తిరస్కరణ
న్యూఢిల్లీ: రూ.9వేల కోట్ల రుణ ఎగవేత కేసును ఎదుర్కొంటున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్యా రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి రంగం సిద్ధమైంది. ఆయన పంపిన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ మంగళవారం నాడు తిరస్కరించారు.
మాల్యా రాజీనామా సరైన పద్దతిలో లేని కారణంగా, దానిని తిరస్కరిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ చెప్పారు. నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఈ లేఖ లేదని, సంతకం కూడా యథాతథమైనది కాదని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.
సభ్యత్వ రద్దును తప్పించుకోవడానికి విజయ్ మాల్యా... రాజీనామా లేఖకు సంబంధించిన స్కాన్డ్ ప్రతిని బ్రిటన్ నుంచి అన్సారీకి పంపించారు. ఇందులోని సంతకం కూడా స్కాన్ చేసిందని, అందువల్ల ఇది నిబంధనలకు అనుగుమంగా లేదని రాజ్యసభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి.

మంగళవారం సమావేశమైన నైతిక విలువల కమిటీ కూడా ఈ లోపాన్ని గుర్తించింది. రాజీనామాను తిరస్కరించింది. రుణ బకాయికి సంబంధించి ఆయన ఇచ్చిన సమాధానంపై కూడా కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మాల్యా ప్రవర్తన రాజ్యసభ ఎంపీ హోదాకు అనుగుణంగా లేదని అభిప్రాయపడ్డారు.
ఈ అంశంపై కమిటీ.. బుధవారం రాజ్యసభకు తన నివేదికను సమర్పించనుంది. ఒక ఎంపీ సభ్యత్వ రద్దుకు సభలో ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టి, ఆమోదించాల్సి ఉంటుంది. కాగా, మాల్యా దేశంలోని పలు బ్యాంకులకు రూ.9వేల కోట్లు బకాయి పడిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications