మారిన లెక్క-బీజేపీకి జగన్ అవసరం తీరిపోయిందా ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలిచింది. ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల దగ్గరి నుంచి వ్యవసాయ బిల్లులు, ఇతర వివాదాస్పద బిల్లులకు సైతం బీజేపీ అడక్క ముందే మద్దతు ఇచ్చేది. అంతలా వైసీపీ నుంచి మద్దతు పొందిన బీజేపీ మాత్రం ఏపీలో ఎన్నికలకు వచ్చే సరికి క్షేత్రస్ధాయిలో పరిస్ధితుల్ని గమనించి ప్లేటు ఫిరాయించేసింది. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు వైసీపీకి పూర్తిగా కటీఫ్ చెప్పేసేందుకు బీజేపీకి మరో అవకాశం దక్కింది.
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులంతా దాదాపుగా పోటీ లేకుండా గెలిచే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి జరుగుతున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో 12 సీట్లకు గానూ బీజేపీ, దాని మిత్రపక్షాలు 11 సీట్లు, కాంగ్రెస్ ఓ సీటు గెల్చుకునే అవకాశముంది. దీంతో ఎన్డీయే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 110 సీట్ల నుంచి 121 సీట్లకు ఎగబాకనుంది. అంతే కాదు 237 సీట్ల రాజ్యసభలో మెజార్టీ మార్కు అయిన 119 సీట్లను కూడా దాటిపోతుంది. దీంతో ఎన్డీయేకు ఎట్టకేలకు మెజార్టీ దక్కినట్లవుతోంది.

ఈ మెజార్టీ లేకపోవడం వల్లే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఏపీలో వైసీపీ, ఒడిశాలో బీజేడీతో గత ఐదేళ్లుగా అంటకాగింది. చివరికి సొంతంగా రాజ్యసభలో మెజార్టీ సాధించడంతో ఇక వీరిద్దరి అవసరం లేకుండా పోయింది. ఇదంతా ముందే ఊహించిన బీజేపీ ఈ రెండు పార్టీల్ని తాజా సార్వత్రిక ఎన్నికలకు ముందే వదిలించేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజ్యసభలో కాశ్మీర్ తో పాటు నామినేటెడ్ సభ్యులు కలిపి మరో 8 మంది సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది. వీరంతా ఎన్డీయేకు మద్దతుగా రానున్నారు. దీంతో ఎన్డీయే మెజార్టీ మరింత పెరకబోతోంది. ఈ పరిణామాలతో వైసీపీ అవసరం బీజేపీకి ఇక లేనట్లే.
ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ బలం 96 ఎంపీలకు చేరనుండగా.. కాంగ్రెస్ బలం 27కు చేరనుంది. తృణమూల్ కాంగ్రెస్ 13, ఆప్ 10, డీఎంకే 10, ఆర్జేడీ 5 సీట్లు కలిగి ఉన్నాయి. వైసీపీకి 11, బీజేడీకి 9 సీట్లు ఉన్నాయి. విపక్ష ఇండియా కూటమికి చూసుకుంటే 88 మంది ఎంపీలు ఉన్నట్లు.












Click it and Unblock the Notifications